calender_icon.png 8 September, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలా ముందుకెళ్దాం?

08-09-2025 01:33:32 AM

  1. సుప్రీంకోర్టు ఆదేశాలు, స్పీకర్ నోటీసులతో ముఖ్యమంత్రితో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ 
  2. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామంటూ స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వాలని నిర్ణయం 
  3. హస్తం పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినందున దానం నాగేందర్ విషయంలో కాస్త ఇబ్బంది 
  4. మిగతావారెవ్వరికేమీ కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ 
  5. నియోజకవర్గాల్లోని నాయకుల మధ్య విభేదాల పరిష్కార బాధ్యత పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌కు అప్పగింత

హైదరాబాద్, సెప్టెంబర్ ౭ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆదివారం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. స్టేషన్‌ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి కడియం శ్రీహరి మినహా మిగతా 9 మంది జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. పార్టీ ఫిరాయంపులకు సంబంధించి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం.. స్పీక ర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పార్టీ ఫిరాయిపులకు పాల్పడిన ఈ పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంతో ఏం చేద్దాం.. ఎలా ముందుకెళ్దామనే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు.

అయితే స్పీకర్ నోటీసులకు కొందరు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వగా, మిగతా వారు కూడా వివరణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశామని, తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని స్పీకర్‌కు వివరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సాంకేతికంగా ఏవైనా ఇబ్బందులు ఎదురవ్వొచ్చేమోగానీ, మిగతా తొమ్మిది ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనే అభిప్రాయం వ్యక్తమైంది.

అయినప్పటికీ కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రజలకు చెప్పుకునే విధంగా అభివృద్ధి పనులను వేగవంతం చేద్దామనే నిర్ణయించినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, వాటికి కావాల్సిన నిధులపై నోటిఫై చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అంతకముందు నియోజకవర్గాల్లోని పాత, కొత్త నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను ఎమ్మెల్యేలు దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు.

అంతే కాకుండా నియోజక వర్గాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు కోరినట్టు సమాచారం. నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించే బాధ్యతను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అప్పగిస్తానని సీఎం హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు మెరుగుపడుతుందని, ఆ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకుంటామని సీఎం అభిప్రాయపడినట్టు సమాచారం. అధికారంలో ఉన్నందున ఏ ఎన్నికలొచ్చినా ఎదుర్కొనేందుకు నాయకులు పార్టీ క్యాడర్‌ను సిద్ధం ఉంచాలని సూచించినట్టు సమాచారం.  

బీఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు.. బీజేపీ బలపడలేదు.. 

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ పరిస్థితి గందరగోళంగా ఉందనే అం శం చర్చకు వచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవటం, అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి రావడంతో పాటు కుటుంబ పంచాయితీతో మరింత డీలా పడిందని చర్చ జరిగినట్టు సమాచారం.

ఇలాంటి సమయంలో ఇక బీఆర్‌ఎస్ కోలుకొనే పరిస్థితి లేదని, ఒకవేళ ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్ తట్టుకొని నిలబడే స్థితిలో లేదని సీఎం చెప్పుకొచ్చారు. ఇక బీజేపీ తెలంగాణలో బలపడలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపదన్న అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం.

భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల), అరెకపుడి గాంధీ (శేరిలింగంపల్లి), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు), సంజయ్‌కుమార్ (జగిత్యాల), కాలే యాదయ్య (చేవేళ్ల), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్) ఉన్నారు.