calender_icon.png 8 September, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ అభివృద్ధి

08-09-2025 02:04:01 AM

  1. గత పదేళ్లు రాష్ట్రానికి స్వర్ణయుగం
  2. మున్సిపాలిటీ కార్మికుడు మహేశ్ ఆత్మహత్య బాధాకరం
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, గణాంకాలు, నివేదికలు, డేటా అన్నీ ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని, గత పదేళ్లు తెలంగాణకు స్వర్ణయుగంగా నిలిచాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్టర్ వేదికగా తెలంగాణ ఆదాయంపై ట్వీట్ చేశారు.

బీఆర్‌ఎస్ పాలనలో సమగ్ర, సమన్విత, సమతుల్య అభివృద్ధి మోడల్ ద్వారా తెలంగాణ రాష్ర్టం స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ లేని మార్పును సాధించిందని తెలిపారు. 2014లో రాష్ర్టం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం రూ.1 లక్ష లోపే ఉండేదని తెలిపారు. 2024 నాటికి ఆ సంఖ్య రూ.3.87 లక్షలకు పెరిగిందని, ఇది దేశంలోనే అత్యధికమని వెల్లడించారు.

ఈ అపూర్వ విజయానికి కారణం మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టి అభివృద్ధి మోడల్ అని కొనియాడారు. ప్రతి వర్గానికీ మద్దతుగా పలు సంక్షేమ పథకాలు, భారీ స్థాయిలో మౌలిక వసతుల నిర్మాణం, చారిత్రాత్మక నీటిపారుదల ప్రాజెక్టులు, రైతు కేంద్రిత పథకాలు, పరిశ్రమల వృద్ధికి అనుకూల వ్యాపార విధానాలు, ఐటీ, సేవల రంగంలో విస్తరణ, నిరంతర సుభిక్షత అని వివరించారు

మహేశ్ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..

ఐదు నెలలుగా జీతాలు అందక ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుడు మహేశ్ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ట్విట్టర్ వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస నెలనెలా జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిని తెచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ములుగు నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణ ఘటనకు మంత్రి సీతక్క తో పాటు.. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యులని, ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, నెలల తరబడి పెండింగ్ పెడితే పేద కార్మికులు ఎలా బతకాలో ముఖ్యమంత్రి, మంత్రి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు. మహేశ్ కుటుంబానికి వెంటనే రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు..

అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తూ పెండింగ్ వేతనం రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న కార్మికుడు మైదం మహేశ్ మృతిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీశారు. ఈ మేరకు రెడ్‌కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి కేటీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం మాధవరావుపల్లిలోని మృతుని ఇంటికి చేరుకొని పరామర్శించారు.

విషయాన్ని కేటీఆర్‌కు ఫోన్‌లో తెలియజేయగా కేటీఆర్ మృతుడి తల్లితో మాట్లాడి మైదం మహేశ్ చనిపోవడానికి గల కారణాలను అడిగారు. సతీశ్‌రెడ్డి వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేశ్‌రెడ్డి, నాయకులు పోరిక పోమానాయక్, వేముపల్లి భిక్షపతి, పోరిక విజయ్‌రామ్‌నాయక్, గజ్జి నగేశ్, కోగిల మహేశ్, ఆకుతోట చంద్రమౌళి, గరిగె రఘు తదితరులు పాల్గొన్నారు.