calender_icon.png 8 September, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుడి అవతారమెత్తిన పోలీస్

08-09-2025 01:54:20 AM

  1. వాగ్దేవి ల్యాబ్‌పై నిరంతర నిఘా
  2. డ్రగ్ తయారీపై వివరాల సేకరణ 
  3. ఎప్పటికప్పుడు మహారాష్ట్ర పోలీసులకు చేరవేత
  4. చర్లపల్లి డ్రగ్స్ కేసులో బయటపడుతున్న సంచలనాలు 
  5. ల్యాబ్ యజమానిపై గతంలోనే డ్రగ్ కేసు 
  6. డ్రగ్స్ తయారీ స్థానిక పోలీసులకు తెలుసని అనుమానాలు!

మేడ్చల్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): చర్లపల్లిలోని వాగ్దేవి లాబొరేటరీలో డ్రగ్స్ తయారీ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దినసరి కూలీగా మహారాష్ట్ర పోలీస్ చేరి, వివరాలు సేకరించి, గుట్టు రట్టు చేశాడు. అయితే వాగ్దేవి లాబొరేటరీ యజమానిపై డ్రగ్ కేసు తయారీ కేసు ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఎక్కడైతే తెలంగాణ పోలీసులు విఫలమయ్యారో అక్కడే ముంబై నార్కోటిక్ పోలీసులు సక్సెస్ అయ్యారు.

ముంబై పోలీసులు ఆపరేషన్ పగడ్బందీగా నిర్వహించి డ్రగ్స్ తయారీ గుట్టు రట్టు చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఫాతిమా అనే మహిళ ముంబైలో డ్రగ్స్‌తో పట్టుబడింది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా ముంబై నార్కోటిక్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చర్లపల్లి పారిశ్రామిక వాడకు వచ్చి పరిస్థితులను పరిశీలించారు. నెల రోజులపాటు నిఘా వేశారు. నిందితుడు తన లేబరేటరీలో పెర్మనెంట్‌గా కూలీలను పెట్టుకోకుండా జాగ్రత్తపడ్డాడు.

ఎవరికి అనుమానం రాకుండా దినసరి కూలీలతో పని చేయించుకుంటాడు. దర్యాప్తులో ఇది ముంబై పోలీసులకు కలిసి వచ్చింది. ఒక పోలీస్ దినసరి కూలీగా వాగ్దేవి లాబొరేటరీకి వెళ్లేవాడు. అలా వెళ్లి మొత్తం వివరాలు సేకరించారు. ఆ పోలీస్ ఇచ్చిన పక్కా ఆధారాలతో వాగ్దేవి లేబరేటరీలో ముంబై పోలీసులు దాడులు చేశారు. అయితే నెలరోజుల పాటు నిఘా వేసినా ముంబై నార్కోటిక్ పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.

ముంబై పోలీసులు కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా అరెస్టులు జరిగే అవకాశం ఉందని, ఇది ఒక పెద్ద రాకెట్ అని తెలిసింది. లేబరేటరీలో పనిచేసిన కూలీలను విచారణకు రావాలని పోలీసులు ఆదేశించారు. శనివారం సీజ్ చేసిన ముడి సరుకును ముంబైకి తరలించారు. వాగ్దేవి ల్యాబ్‌కు ఎక్కడెక్కడ నుంచి, ఏ ఏ రాష్ట్రాల నుంచి ముడి సరుకు రవాణా జరిగిందనే విషయమై ముంబై నార్కోటిక్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

ముడిసరుకు గురుగావులోని కిమియా బయో సైన్స్ నుంచి తెప్పించినట్లు ముంబై నార్కోటిక్ పోలీసుల దర్యాప్తులో తేలింది. వాటిపై లేబుల్స్ మార్చి సరుకు రవాణా చేసినట్లు గుర్తించారు. కాగా పోలీసుల అదుపులో ఉన్న వాగ్దేవి ల్యాబ్స్ యజమాని శ్రీనివాస విజయ్ ఓలేటి గతంలో ఇదే కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. అరెస్టు కాకుండా వ్యవస్థలను ప్రభావితం చేసినట్టు తెలిసింది.

అరెస్టు కాకుండా చూసుకున్నాడు అంటే డ్రగ్స్ తయారీ విషయం పోలీసులకు ఇతర అధికారులకు తెలుసు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగేళ్లుగా ఎవరికీ తెలియకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నాడంటే అన్ని ప్రభుత్వ శాఖల సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇక్కడ తయారుచేసిన డ్రగ్‌ను నిందితుడు రూ.50 లక్షలకు కిలో చొప్పున విక్రయించినట్టు తెలిసింది. ఒక ముఠాను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా అమ్మకాలు సాధించినట్లు తెలిసింది. నాచారం, చర్లపల్లిలో తయారుచేసినట్టు తెలుస్తోంది.