08-09-2025 01:48:59 AM
పడగవిప్పిన యూరియా ‘బ్లాక్ మార్కెట్’
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): ఈసారి నైరుతి ముందే వచ్చింది. వర్షపాతం ఆశాజనకంగా ఉంది. సాగునీరు పుష్కలంగా ఉంది. వానాకాలం మొదలైన తర్వాత రైతులు రాష్ట్రంలో విస్తారంగా వరి పంట పండిస్తున్నారు. సన్నాల కు రూ.500 సర్కార్ అదనంగా బోనస్ ఇస్తుండటంతో వరి సాగు విస్తీర్ణాన్ని అమాంతం పెంచేశారు. ఆ తర్వాతి స్థానం లో రైతులు పత్తికి ప్రాధాన్యమిచ్చారు. ఆ తర్వాత మక్కల సాగు మూడోస్థానంలో ఉంది.
ఇక తాము దర్జాగా వ్యవసాయం చేసుకోవచ్చని రైతులు భావించగా యూరి యా సంక్షోభం వారి నెత్తిన పిడుగు పడే లా చేసింది. ఆగస్టు నెలాఖరు నాటికి పం ట ఎదిగే దశకు వస్తుంది. ఈ తరుణంలో యూరి యా చల్లటం అత్యంత కీలకం. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర అవసరాలకు తగినంత విధంగా, కేంద్రం నుంచి కూడా యూరియా అందలేదు. సరఫరా వైఫల్యా ల వల్ల కూడా రైతులకు సరిగ్గా యూరి యా అందలేదు.
ఇలాంటి సందర్భంలో రైతుల అవసరాన్ని గుర్తించిన వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు యూరియాను విక్రయించడం ప్రారంభించారు. అలా రైతుల జేబులకు రూ.540 కోట్ల మేరకు చిల్లు పెట్టి, సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం బ్లాక్ మార్కెట్‌లో 50 కిలోల యూరియా బస్తా ధర రూ.268, అదే 45 కిలోల బస్తాకు రూ.242 ధర పలుకుతున్నది. పంట అదను దాటుతున్న తరుణం లో యూరియా సంక్షోభం ఏర్పడింది.
దీంతో రైతులు ఎలాగైనా యూరి యా దక్కించుకుని పంటను కాపాడుకోవాలని నిర్ణ యించుకున్నారు. ఈ బలహీనత ను గమనించిన డీలర్లు, విక్రయదారులు బ్లాక్ మార్కెట్‌లో యూరియా అమ్మడం మొదలుపెట్టారు. 50 కిలోల బస్తాకు రైతుల నుంచి రూ.350 చొప్పున (అసలు ధరకు రూ.80 వరకు అదనం) వసూలు చేశారు. అలాగే 45 కిలోల బస్తాకు (అసలు ధరకు రూ. 50 వరకు అదనం)గా వసూలు చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో కొందరు వ్యాపారులు ఒక బస్తా యూరియాను రూ.400 వరకు వసూలు చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ గ్రామంలో కొందరు వ్యాపారులు బస్తాపై రూ.40 అదనంగా వసూలు చేయడమే కాకుండా, యూరియాకు బదులు నాసిరకం ద్రవరూప యూరియాను అంటగట్టారని రైతులు ఆగ్ర హం వ్యక్తం చేసిన ఘటన చోటుచేసుకున్నది. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల ఆడపడచులు యూరియా కోసం సిగపట్లు పడిన సందర్భం కనిపించింది. కొన్ని కుటుంబాల్లో యావత్ కుటుంబంతా క్యూలైన్లలో బారులు తీరిన ఘటనలున్నాయి.
అంచనాలకు మించి వరి సాగు..
రాష్ట్రంలో సంక్షోభానికి ప్రధాన కారణం సాగు విస్తీర్ణం పెరగడం, అందుకు తగిన విధంగా యూరియా సరఫరా లేకపోవడం. ఈ వ్యత్యాసం రైతులపై తీవ్రమైన ప్రభావం చూపింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో సాగునీటి లభ్యత ఎక్కువగా ఉన్నం దున వానాకాలంలో రైతులు వరి సాగుకు ప్రాధాన్యమిచ్చారు. గతంలో కంటే ఎక్కువ విస్తీర్ణంలో సన్నాలు సాగు చేస్తున్నారు. సన్నాలకు ప్రభుత్వం బోనస్ ఇస్తుండటం కూడా ఓ కారణం.
పంటల సాగు విస్తీర్ణం..
2024 వానకాలంలో 32 లక్షల ఎకరా ల్లో వరి సాగైంది. ఈ ఏడాది ఆ విస్తీర్ణం ఏ కంగా 72.36 శాతం పెరిగి 55 లక్షల ఎకరాలకు చేరింది. అలాగే రైతులు 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 12.5 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 10.48 లక్షల టన్నులు పంపిణీ చేయాలనే అంచనాకు వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ పం పించింది. కానీ, కేంద్రం ఇప్పటివరకు కేవ లం 9.8 లక్షల టన్నులు కేటాయించింది.
సరఫరా చేసిన యూరియాలో ఏప్రిల్ మధ్య 8.3 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేయాల్సి ఉండగా, ఆగస్టు రెండోవారం నాటికి 5.6 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అయింది. వానాకాలం సీజన్‌లో ఆగస్టు, సెప్టెంబర్ నెలలు పంటలు ఎదుగుతున్న దశ. ఆ దశలో ఆగస్టు నెలకు రాష్ట్ర వ్యాప్తంగా 3.22 లక్షల టన్నులు, సెప్టెంబర్ నెలకు 2.66 లక్షల టన్నుల యూరియా అవసరం. ఈ రెండు నెలల్లో యూరియా కొరత ఏర్పడటంతో ఆ ప్రభావం దిగుబడిపై ప్రభావం చూపే పరిస్థితి నెలకొన్నది.
స్థానికంగా యూరియా ఉత్పత్తి ఆటంకం..
రాష్ట్రంలో రోజురోజకూ యూరియా డి మాండ్ పెరుగుతున్నది. అందిన ఆ కాస్త యూరియాను కూడా సరఫరా చేయడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమవుతున్నది. తెలంగాణకు అవసరమైన డిమాండ్‌లో సగం యూ రియా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోవడం పెద్ద సమస్యగా పరిణమించింది. గ్యాస్ పైప్‌లైన్ లీకులు, యం త్రాల వైఫల్యం కారణంగా ఈ ప్లాంట్ ఏప్రిల్- మధ్య ఏకంగా 78 రోజుల పాటు మూతపడింది.
ఫలితంగా, ఆగస్టు నెలకు కేటాయించిన 65,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యానికి, కేవలం 24, 000 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయగలిగింది. అలాగే ఒడిశాలోని తాల్చేర్ ఫెర్టిలైజర్ ప్లాంట్, నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ కూడా పూర్తిస్థాయిలో యూరియా ఉత్పత్తి చేయకపోవడం కూడా రాష్ట్రంపై ప్రభావం చూపింది.
మరోవైపు, దేశీయంగా 15 యూరియా దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు అంతర్జాతీయంగానూ ఎదురుదెబ్బలు తగిలాయి. చైనా ఎగుమతులపై ఆంక్షలు, పెరిగిన సహజవాయువుల ధరలు, రష్యా యుద్ధం, ఇరాన్ -ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా ఎర్ర సముద్రం(రెడ్ సీ)లో షిప్పింగ్ మార్గాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. జూలై 2025 నాటికి చైనా ధరలు సైతం టన్నుకు 12శాతం పెరిగాయి.
రాజకీయ నేతల రాజకీయాలు..
తెలంగాణలో యూరియా కొరత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్రమైన రాజకీయ విమర్శలకు దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు అవసరమైనంత యూరియా సమకూర్చాలని కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా కు అనేక లేఖలు రాశారు. అయినప్పటికీ.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందనలేదని సీ ఎం, మంత్రి విమర్శలు గుప్పించారు.
అందు కు ప్రతిగా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బం డి సంజయ్‌కుమార్, బీజేపీ నేతలు 2024 -25 యాసంగిలో రాష్ట్ర డిమాండ్‌కు మించి 10.02 లక్షల టన్నుల యూరియా సరఫరా చేశామని, రాష్ట్రప్రభుత్వానికి యూరియా పంపిణీ చేతకాకపోవడమే అసలు సమస్య అని సీఎం, మంత్రుల విమర్శలను తిప్పికొట్టారు. అధికారిక గణాంకాలు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నాయి.
2024 రాష్ట్ర అవసరాలకు 20.8 లక్షల ట న్నులు అవసరం కాగా, 20.02 లక్షల టన్ను ల యూరియా మాత్రమే అందిందని, రైతు లు అధికంగా యూరియా వినియోగించారనేది నిజం కాదని చెప్తున్నాయి. మొత్తానికి రాజకీయనేతల రాజకీయాలు ఎలా ఉన్న, వారి మధ్య నలిగి 70.6 లక్షల మంది రైతులు నలిగిపోతున్నారు. యూరియా కొర త కారణంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటల దిగుబడి 10- 15 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది.
తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవ స్థ దెబ్బతినే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. రైతులు వందల కోట్ల ఆదాయం నష్టపోతారని చెప్తున్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పటికైనా యూరియా దిగుమతులను వేగవంతం చేసి, పంపిణీ వ్యవస్థను గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే, నానో యూరియా వాడకాన్ని ప్రో త్సహించాల్సి అవసరం ఉంది.
ఒడవని యూరియా గోస..
మహబూబాబాద్, /హనుమకొండ/హుజూరాబాద్, సెప్టెంబర్ 7 (విజయ క్రాంతి): రైతులకు యూరియా గోస తీరడం లేదు. విక్రయా కేంద్రాల వద్ద క్యూ తప్పడం లేదు. సెలవు రోజైన విధుల్లోనే వ్యవసాయాధికారులు ఉంటూ.. పోలీసు బందోబస్తు నడుమ పంపిణీ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం వివిధ మండలాల్లోని ఎరువుల విక్రయ కేంద్రాల వద్దకు వందల సంఖ్యలో రైతు లు యూరియా కోసం తరలివచ్చారు.
ఆదివారం సెలవు అయినప్పటికీ అధికారులంతా వివిధ మండలాల్లో యూరియా పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని శనిగపురం, కురవి, నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెంలో స్వయంగా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్, ఏడిఏ శ్రీనివాసరావు, హార్టికల్చర్ అధికారి మరియన్న యూరియా పంపిణీ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. శనిగపురం వద్ద పెద్ద ఎత్తు న రైతులు తరలి రావడంతో ఎ స్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్, డీఎస్పీ తిరుపతిరావు రైతులను స్వయంగా క్యూలైన్లో పెట్టి, గొడవలు లేకుండా యూరియా పంపిణీ చేపట్టారు.
గ్రామాల వారిగా రెవెన్యూ రికార్డుల ప్రకారం పట్టా పాస్ పుస్తకం ఉన్న రైతుకు రేషన్ కార్డుకు డీలర్ వద్దకు వెళ్తే బియ్యం ఇచ్చిన విధంగా ఒక్కో యూరియా బస్తా పి ఓ ఎస్ మిషన్ ద్వారా వేలిముద్ర వేయించి పంపిణీ చేపట్టారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు, దామెర మండలాల్లో సైతం పోలీసుల బందోబస్తు మధ్య రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్ పరిధిలోని సైదాపూర్ మండలం వెన్కెపల్లి ప్రాథమిక వ్యవసాయ సొసైటీ వద్ద రైతుల వేలిముద్రలు పకడ్బందీగా సేకరించి ఆదివారం యూరియా పంపిణీ చేశారు. అయితే తామేమైనా దొంగలమా వేలిముద్రలతో యూరియా పంపిణీ చేయడం ఏమిటని పలువురు రైతులు ప్రశ్నించారు. పంటలు వేసి రెండు నెలలు గడుసున్నప్పటికీ ప్రభుత్వం సరిపడా యూరియా పంపిణీ చేయలేదని, వచ్చిన యూరియాను సరిగి పంపిణీ చేయడం లేదన్నారు.