01-09-2025 01:27:49 AM
బీసీ పొలిటికల్ ఫ్రంట్ హెచ్చరిక
ముషీరాబాద్, ఆగస్టు 31(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమ లు చేయకుంటే రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మారుస్తామని బీసీ పొలిటికల్ ప్రంట్ చైర్మ న్ బాలగోని బాలరాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, యెలికట్టే విజయ కుమార్ గౌడ్, ఎస్. దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్‌లు హెచ్చరించారు. 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరోసారి రాజకీయ పార్టీలు మోసం చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు.
ఈ మేరకు ఆదివారం చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ప్రంట్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ... 42 శాతం రిజర్వేషన్ పై అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందని, దీనికి పార్లమెంట్‌లో చట్టబద్దత కల్పించి 9వ షెడ్యూల్డ్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. కమిషన్ల పేరుతో కాలయాపన చేయాలని చూస్తే కబాడ్గార్ అని హెచ్చరించారు.
జివోలతో రిజర్వేషన్లు అమలు కావని, వెంటనే 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు బీసీలను మోసం చేయాలని చూస్తున్నాయని, బీసీలంటే జెండాలు మోసే వారుగా, ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలంతా తిరగబడితే ఏ పార్టీలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ ప్రంట్ నాయకులు బైరు శేఖర్, దామోదర్ గౌడ్, ముత్యం ముఖేష్ గౌడ్, గుజ్జ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.