19-07-2025 01:23:58 AM
మెదక్, జూలై 18 (విజయక్రాంతి): తెలంగాణలో బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంటే సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేసి, చిత్తశుద్ధితో బీసీలను సీఎం పదవిలో కూర్చోబెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మెదక్ జిల్లాకు శుక్రవారం తొలిసారిగా వచ్చిన సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
అంతకుముందు నర్సాపూర్ పట్టణంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మెదక్ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో రాంచందర్‌రావు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై కపట ప్రేమ ఉన్నదన్నారు. నిజంగా కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే బీసీ నేతను సీఎంగా ప్రకటించాలన్నారు. తెలంగాణలో 40 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పారు. విమర్శలు చేసే పక్క పార్టీ నేతలు గత పదేళ్లలో కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఎందుకు చెప్పారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రంలో రైతులు పంటలు వేసుకుని సాగునీటి కోసం ఎదురు చూస్తుంటే రైతులకు సింగూరు నీరు విడుదల చేయడంలో తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్రం నిధుల తోనే నేషనల్ హైవే, రైల్వే లైన్స్ నిర్మిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు దేశం వ్యాప్తంగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఇస్తే బీసీలకు నష్టం జరుగుతుందని తెలిపారు. 2028లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడితే గెలుపు మనదేనని తెలిపారు. మతం పేరుతో విభజించి ఓట్లు అడిగిన పార్టీ కాంగ్రెస్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి బీసీలపైన చిత్తశుద్ధి ఉంటే క్యాబినెట్‌లో బీసీలకు 8 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో సీఎం రేవంత్ మీడియాతో చేసింది చిట్ చాట్ కాదని చీటింగ్ చాట్ అని విమర్శించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, కరణం పరిణీత, సంగప్ప, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు.