calender_icon.png 23 July, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు ప్రజాప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తాం

22-07-2025 05:29:19 PM

రేపు బంద్‌కు పిలుపు..

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఉద్యమ బాటపట్టాయి. ఈ మేరకు సిపిఐ నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కార్యాలయంలో జరిగిన సమావేశంలో విద్యార్థి, యువజన సంఘాల నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బలుమల ప్రేమ్ కుమార్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేశమోని ఆంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని పాఠశాలలు, హాస్టల్స్ దయనీయ పరిస్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. వర్షాకాలంలో భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని, వెంటనే పాత భవనాలను కూల్చి కొత్తవి నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.8వేల కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌ల విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డిఇఓ పోస్టుల భర్తీ చేయాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. అనుమతి లేని పాఠశాలలు, కళాశాలలను సీజ్ చేయాలి. ఈ డిమాండ్లతో పాటు, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా ప్రతినిధుల ఇండ్లను ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. 23న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ప్రకటించగా, అంబేద్కర్ విగ్రహం వద్ద బంద్ గోడపత్రికను ఆవిష్కరించారు. తల్లిదండ్రులు, కవులు, కళాకారులు, విద్యార్థులు అందరూ బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు.