03-01-2026 12:00:00 AM
టెహ్రాన్, జనవరి ౨: ఇరాన్‌లో వెల్లువెత్తుతున్న ప్రజల నిరసనలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రజలపై ఇరాన్ ప్రభుత్వం దాడులు చేస్తే ఊరుకోబోమని, తాము యుద్ధనికైనా సిద్ధంగా ఉన్నామని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. నిరసనకారులను పొట్టనపెట్టుకోవడం ఇరాన్‌కు అలవాటేనని.. మళ్లీ ఇరాన్ అలాంటి పనే చేస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని ప్రకటించారు.
ఈ వ్యాఖ్యలపై ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు అలీ షమ్ఖానీ స్పందిస్తూ.. అమెరికా నిష్ఠూరాలు ఎలా ఉంటాయో ఇరాన్ ప్రజలకు బాగా తెలుసుననిని ట్రంప్‌ను ఎద్దేవా చేశారు. అమెరికా జోక్యం కారణంగా గతంలో ఆఫ్గనిస్తాన్, గాజాలో ఏ జరిగిందో యావత్ ప్రపంచం చూసిందని గురుచేశారు. ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా సైన్యం ఎలా పలాయనం చిత్తగించిందో అందరికీ తెలుసునన్నారు.
తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విషయంలో ఒకవేళ అమెరికా గనుక సైనిక చర్యకు దిగితే, తాము కూడా సిద్ధమని సవాల్ విసిరారు. అమెరికాకు సరైన బుద్ధి చెబుతామని ఆయన వ్యాఖ్యానించారు.