03-01-2026 12:00:00 AM
బ్యానర్లు కట్టే విషయంలో ఎమ్మెల్యే నారా, ఎమ్మెల్యే గాలి వర్గాల మధ్య వాగ్వాదం
ఘర్షణకు దారి తీసి.. రాళ్లు, సీసాలతో పరస్పర దాడులు
గాలి జనార్దర్‌రెడ్డి గన్‌మెన్ తుపాకీ లాక్కుని సతీశ్‌రెడ్డి కాల్పులు
కాల్పుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాజశేఖర్ మృతి
బెంగళూరు, జనవరి ౨: కర్ణాటకలోని బళ్లారి నగరంలో రాజకీయ కక్షలు శుక్రవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గంగావతి ఎమ్మెల్యే, బీజేపీ నేత గాలి జనార్దన్‌రెడ్డి నివాసం వద్ద తెల్లవారుజామున రెండువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఉద్రిక్తత కాల్పుల వరకు దారితీయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ హింసాత్మక ఘటనలో రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త బుల్లెట్ గాయంతో అక్కడికక్కడే మరణించాడు. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి, బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వర్గాల మధ్య చోటుచేసుకున్న ఈ వివాదం రక్తపాతానికి దారితీసింది. మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నేపథ్యంలో బ్యానర్లు కట్టే విషయంలో ఈ వివాదం మొదలై హింసాత్మకంగా ముగిసింది.
గాలి జనార్దన్‌రెడ్డి ఇంటి ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని ఆయన అనుచరులు అడ్డుకోగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా ముదిరి రాళ్లు, బీరు సీసాలతో పరస్పర దాడుల వరకు వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో గాలి జనార్దన్‌రెడ్డి గంగావతి నుంచి తన నివాసానికి చేరుకున్నారు. ఆయన కారు ఇంటివద్దకు చేరుకోగానే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సతీష్‌రెడ్డి అనే వ్యక్తి గాలి జనార్దన్‌రెడ్డి గన్‌మెన్ నుంచి తుపాకీ లాక్కుని కాల్పులకు దిగాడు. ఈ క్రమంలోనే రాజశేఖర్ అనే యువకుడికి బుల్లెట్లు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల్లో మరికొందరు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఓ ఆసుపత్రికి తరలించారు.
తనపై నేరుగా హత్యాయత్నం జరిగిందని గాలి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఘటనా స్థలంలో దొరికిన ఖాళీ బుల్లెట్ కేసింగ్‌ను ఆయన స్వయంగా మీడియాకు చూపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు బాష్ప వాయువును కూడా ప్రయోగించాల్సి వచ్చింది. బళ్లారి ఎస్పీ, ఐజీపీ పరిస్థితులను సమీక్షించారు. కాల్పుల ఘటనపై గాలి జనార్దన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీరాములుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడి ఫిర్యాదు మేరకు మరో 11 మందిపై కూడా బ్రూస్‌పేట పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.