28-11-2025 01:06:23 AM
-కాంగ్రెస్ నగర అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్
కరీంనగర్ క్రైం, నవంబరు 27 (విజయ క్రాంతి): బిఆర్‌ఎస్ నేతలు చల్లా హరిశంకర్ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ పై కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని, మాజీ మేయర్ బిజెపి నేత వై సునీల్ రావు ప్రజా పాలన పట్ల ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ చేపడుతున్న సంతకాల సేకరణను ప్రజలు విశ్వసించరని, అవినీతిపరుల ఆరోపణలు పట్టించుకోవద్దని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ తెలిపారు.
గురువారం నగరంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు మున్సిపల్ కార్పొరేషన్ ను ఏలిన బిఆర్‌ఎస్ పాలకవర్గం చేసిన అప్పు మున్సిపల్ చెత్తకు మించిన దానిలా ఉందని ఎద్దేవా చేశారు. మా ప్రభుత్వం పై, మా మంత్రులపై అవాకులు చివాకులు పేలే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని, బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులను తీర్చడానికి, ఆ భారం ప్రజలపై పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పురోగతి సాధిస్తుంటే బిఆర్‌ఎస్ నేతలు ఏ విధంగా విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థను పూర్తి అవినీతిమయం చేసి దీనిపై చర్చించకుండా ప్రభుత్వంపై నిందలు వేసే పని పెట్టుకున్న బిఆర్‌ఎస్ నేతలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. ఈ విధమైన అబద్ధపు ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన సంక్షేమ పథకాల గురించి, అమలు చేసిన హామీల గురించి చర్చించడానికి మేము సిద్ధం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలపై చర్చించేందుకు మీరు సిద్ధమా అనిసవాల్‌విసిరారు.