calender_icon.png 10 September, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ రాజ్యమంటే కాంగ్రెస్ మార్క్ పోలీస్ రాజ్యమా?

10-09-2025 07:04:44 PM

గణేశ్ నిమజ్జనం సందర్భంగా అక్రమ కేసులు

కేసీఆర్ పాటలు వింటే పోలీసులకెందుకు అభ్యంతరం

పోలీసుల తీరుపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 

ఆర్మూర్ (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యమంటే కాంగ్రెస్ మార్క్ పోలీస్ రాజ్యమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి(Former MLA Jeevan Reddy) మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలో యథేచ్ఛగా పోలీసు ఆరాచకాలు కొనసాగుతున్నాయని, కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి కాంగ్రెస్ సేవలో తరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఆర్మూరులో యువకులు పెద్దఎత్తున డీజేలలో మళ్లీ కేసీఆరే రావాలి, కారే రావాలి అని పాటలు వింటూ డ్యాన్స్ లు చేస్తే వారిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని జీవన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ పాటలు వింటే పోలీసులకెందుకు అభ్యంతరం అని ఆయన నిలదీశారు. దళిత యువకుడు రోహిత్ ను పోలీసులు అక్రమంగా నిర్బంధించి రెండు రోజులుగా చిత్రహింసలు పెడుతున్నారని, రోహిత్ కోసం ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తున్నా పోలీసులకు కనికరం లేదని జీవన్ రెడ్డి అన్నారు. తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా పోలీసు అధికారులు స్పందించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు ప్రజలను కాపాడే పోలీసులా?, హింసించే కాంగ్రెస్ కార్యకర్తలా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్మూర్ లో అధికార పార్టీ అండదండలతో తెల్లార్లు పేకాట క్లబ్ లు జోరుగా నడుస్తున్నాయని, మట్కా జూదమాడుతున్నారని, విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతు న్నాయని, నల్లమట్టి స్మగ్లింగ్  సాగుతోందని, వారిని పట్టుకోకుండా కేసీఆర్ ను అభిమానించే వారిపై పోలీసులు ప్రతాపం చూపడం ఎక్కడి న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడైనా ఇలాంటి చిల్లర పనులు చేశామా? అభివృద్ధికి తప్ప అరాచకాలకు చోటిచ్చామా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు తొత్తులుగా మారి అరాచకాలకు పాల్పడుతున్న పోలీస్ అధికారుల పేర్లు పింక్ బుక్ లో ఎక్కిస్తున్నామన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వ మేనని, కాంగ్రెస్ కు ఊడిగం చేస్తున్న వారి లెక్కలు తెలుస్తామని ఆయన హెచ్చరించారు. పోలీసు నిర్బంధంలో ఉన్న రోహిత్ ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రోహిత్ అక్రమ నిర్బంధంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, మానవ హక్కుల కమిషన్ కు, ఎస్సీ కమిషన్ కు పిర్యాదు చేస్తామని జీవన్ రెడ్డి వెల్లడించారు.