10-09-2025 09:41:36 PM
ఎమ్మెల్యే పాయల్ శంకర్..
అదిలాబాద్ (విజయక్రాంతి): పేద ప్రజలకు ఏమైనా ఆరోగ్య పరిస్థితి బాగా లేకుంటే ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చివరకు పుస్తెలతాడు అమ్ముకొని వైద్య చికిత్సలు చేయించుకునే పరిస్థితి నెలకొందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) ఆవేదన వ్యక్తం చేశారు. అందుచేతనే రాష్ట్ర ప్రభుత్వం పేదల అండగా నిలిచేలా, అనారోగ్యంతో ఆసుపత్రి చేరే పేదల కోసం ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రత్యేక వైద్య సేవలు అందించాలని కోరారు. ఆదిలాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం చేపట్టిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9 లక్షల 57 వేల రూపాయలు విలువ చేసే 41 చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో చేరిన పేదలు, వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే ఖర్చైన మొత్తంలో 20 నుండి 30 శాతం మాత్రమే డబ్బులు వస్తున్నాయని తెలిపారు. కావున అత్యవసర సమయాల్లో అండగా నిలిచేందుకు ప్రజలు సైతం ఆరోగ్య ఇన్సూరెన్స్ లు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.