10-09-2025 09:42:04 PM
హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని బుధవారం సాయంకాలం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్(District Collector Sneha Shabarish) సందర్శించి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేయడుతున్నటువంటి మాడవీధుల నిర్మాణం పనుల పురోగతిని పరిశీలించారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ కు ఆలయ చైర్మన్ డా.బి. శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, బింగి సతీష్, గాండ్ల స్రవంతి,ఈఓ రామల సునీతలు పూర్ణకుంభంతో మంగళవాద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ఆలయ మహామండపంలో శ్రీ భద్రకాళి శేషు ఆధ్వర్యవమున మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.
అనంతరం మాడవీధుల పురోగతిని కుడా అధికారులతో చర్చించి అమ్మవారి నవరాత్రుల నుండి భక్తులందరికీ మాడవీధుల గుండా ఆలయ ప్రవేశానికి మార్గం సుగమమం చేయాలని కుడా అధికారులను కోరారు. అలాగే దారికి అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగించి భక్తులకు అనుకూలంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సుందరంగా నవరాత్రులకు రెండు రోజులకు ముందుగానే ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట కుడా అధికారులు అజిత్ రెడ్డి, భీంరావు, ఆర్.డి.ఓ రమేష్, వరంగల్ ఏ.సి.పి సత్యనారాయణ, మట్వాడ సి.ఐ కరుణాకర్, తహశీల్దార్ రవీందర్ తదితరులున్నారు.