calender_icon.png 10 September, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళితుల భూమిపై అక్రమార్కుల కన్ను!

09-09-2025 01:11:03 AM

-మణికొండలోని ఎకరం భూమి కబ్జా?

-మృతిచెందిన సెక్రటేరియేట్ ఉద్యోగుల పేర్లపై బై నంబర్ ప్లాట్లు సృష్టించి, భారీ మొత్తాలకు విక్రయం

-మాజీ కౌన్సిలర్‌తో పాటు సెక్రటేరియేట్, కాలనీ సొసైటీ కమిటీ సభ్యుల కీలక పాత్ర

-హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా ఆగని ఆక్రమణలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): మణికొండ నెక్నాంపూర్‌లో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. దళితులకు చెందిన సుమారు ఎకరం విలువైన భూమిని నకిలీ పత్రాలు, మృతిచెందిన ఉద్యోగుల పేర్లతో ప్లాట్లుగా మార్చి, భారీ మొత్తాలకు విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కుంభకోణంలో మణికొండ మాజీ కౌన్సిలర్‌తో పాటు సెక్రటేయేట్ కాలనీ సొసైటీ కమిటీ సభ్యుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్‌లో నెక్నాంపూర్ సర్వే నంబర్ 20లోని ఈ భూమిపై గతంలో దళితులు హైకోర్టులో కేసు వేయగా, 2009లో కోర్టు మధ్యంతర ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఈ భూమి పక్కనే సర్వే నంబర్ 31లో సెక్రటేరియేట్ కాలనీ ఉంది. ఇక్కడ 59 ఎకరాలను లేఅవుట్ చేసి ప్లాట్లు వేసుకుని ఇళ్లు కట్టుకున్నారు. అయితే, దళితులకు చెందిన ఈ విలువైన భూమిపై మణికొండ మాజీ కౌన్సిలర్, సెక్రటేరియేట్ కాలనీ సొసైటీకి చెందిన కమిటీ సభ్యులు కన్నేశారు.

సర్వే నంబర్ 20లోని ఎకరం ఖాళీ స్థలంలో బై నంబర్ ప్లాట్లను సృష్టించారు. అంతేకాకుండా, చనిపోయిన సెక్రటేయేట్ ఉద్యోగుల పేర్లపై కొత్తగా ప్లాట్లు కేటాయించి, వాటిని గుర్తు తెలియని వ్యక్తులకు భారీ మొత్తాలకు విక్రయించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలకు మున్సిపాలిటీ అధికారులు, ట్రాన్స్‌కో అధికారులు కూడా సహకరిస్తున్నారని, వారి అండదండలతోనే ఈ దందా యథేచ్ఛగా సాగుతోందని దళితులు, స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ భారీ భూకుంభకోణంలో మణికొండకు చెందిన ఒక మాజీ కౌన్సిలర్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. 

మున్సిపాలిటీలో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని, 300 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి దర్జాగా ఇల్లు నిర్మిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిర్మాణానికి మున్సిపాలిటీ నుంచి అనుమతులు కూడా పొందినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.