09-09-2025 01:10:48 AM
పరిశ్రమ అభివృద్ధిపై టీష్ట్రా డీపీఆర్ సమర్పణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణను సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. భారత్ సెమీకండక్టర్ విప్లవానికి తెలంగాణను లాంచ్ ప్యాడ్‌గా నిలబెట్టే దిశగా, టీ (టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం) చైర్మన్, ఎండి సందీప్ కుమార్ మక్తాలా సోమవారం మంత్రి శ్రీధర్‌బాబుకు సచివాలయంలో సమగ్ర సెమీకండక్టర్ డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను సమర్పించారు.
మంత్రి ఈ నివేదికను అభినందిస్తూ మాట్లాడారు. లక్ష్యంలో ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు అని ప్రశంసించారు. టీష్ట్రా బృందం ఇటీవల తైవాన్, హాంకాంగ్ పర్యటనలో సేకరించిన కీలక వివరాలతో ఈ డీపీఆర్ సిద్ధమైంది. ఈ సందర్బంగా బృందం టీఎస్‌ఎంసీ, ఏఆర్‌ఎం, సైనోసిస్, ఫరడే టెక్నాలజీ, పీయూ ఎఫ్ సెక్యూరిటీ, పీయూఎఫ్ అకాడమీ, జీయూఎస్ టెక్నాలజీ, లైట్‌మ్యాక్స్, సూపర్‌మైక్రో, నేషనల్ యాంగ్ మింగ్ చియావో టంగ్ యూనివర్శిటీ, తైవాన్ సెమీకండక్టర్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ వంటి ప్రపంచ అగ్ర సంస్థలతో పాటు తైరోస్‌లో కూడా పాల్గొం ది.
ఈ పర్యటన ద్వారా చిప్ డిజైన్, సెక్యూర్ ఆర్కిటెక్చర్స్, మాన్యుఫాక్చరింగ్ మోడల్స్, పారిశ్రామిక వినియోగాలపై విలువైన అవగాహన పొందింది. ఈ సందర్భంగా డీపీఆర్‌లో నాలుగు స్తంభాల వ్యూహం రూపొందించారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే 1.5 మిలియన్ సెమీకండక్టర్ నిపుణుల కొరతను దృష్టిలో పెట్టుకుని, భారత్‌లో అవసరమయ్యే 85,000 నిపుణులను తీర్చేందుకు 1,000 ప్రొఫెసర్లు, 10,000 విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
డిజైన్ ఆర్మ్, సైనోసిస్ వంటి గ్లోబల్ నేతృత్వ సంస్థల భాగస్వామ్యంతో డిజైన్ హబ్లు, ఐపీ లైబ్రరీల ఏర్పాట్లు చేయనున్నారు. మాన్యుఫాక్చరింగ్ టీఎస్‌ఎంసీ, ఫరడే మోడల్స్ ప్రేరణతో, పీయూఎఫ్ సెక్యూరిటీ సెక్యూర్ ఫ్రేమ్వర్క్‌ల అనుసరణ, అప్లికేషన్స్ ఈవీ బ్యాటరీలు, ట్రాన్స్పరెంట్ డిస్ప్లేలు, ఏఐ -రెడీ సర్వర్లు, అధునాతన రోబోటిక్స్ రంగాల్లో వినియోగం చేయనున్నారు.