13-07-2025 12:45:35 AM
అలా వచ్చి ఇలా వెళ్లిపోయే సినిమాలెన్నో! వాటి మధ్యలో గుట్టుచప్పుడు కాకుండా థియేటర్లలో అడుగుపెట్టి, అనూహ్యంగా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టే చిత్రాలూ వస్తుంటాయి. మరోవైపు విడుదలైన తర్వాత ఫలితం సంగతి ఎలా ఉన్నా మొదట్నుంచే సినీప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించే సినిమాలు కొన్ని ఉంటాయి.
తమ అభిమాన నటీనటుల కోసం ఉత్కంఠగా ఎదురుచూసే సందర్భాలు చిత్ర పరిశ్రమలో నిత్యనూతనమే! మరి ఇప్పుడు అలా సగటు ప్రేక్షకుడు ఎదురుచూస్తున్న సంగతి ఏమిటని ఆలోచిస్తే..? టాలీవుడ్ మటుకు ఏకంగా నాలుగు సినిమాలని చెప్పక తప్పుదు. ఒక్క టాలీవుడ్ ఏంటి? ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది.. మొత్తంగా ఇండియన్ సినిమా అంతా ఈ చిత్రాల కోసం ఎదురుచూస్తోంది. మరి ఆ సినిమాల కథాకమామిషూ ఏంటో చూద్దాం!
ఈ తొలి అర్ధ వత్సరం టాలీవుడ్‌లో మరీ అంత గొప్ప అద్భుతాలు ఏమీ జరగలేదు. ట్రేడ్ వర్గాల అంచనాల దృష్ట్యా కనీసం 100 సినిమాల్లో 10 చిత్రాలైనా విజయాలు నమోదు చేయాలి. కానీ అలాంటిదేమి జరగలేదనేది ట్రేడ్ వర్గాల మాట. విశేష ప్రేక్షకాదరణ చూరగొటాయని భావించిన సినిమాలెన్నో ఈ 2025 ఫస్ట్ హాఫ్‌లో బోల్తాపడగా, విడుదల కావాల్సిన ప్రాజెక్టులెన్నో వివిధ కారణాలతో వాయిదా పడుతూ అభిమానుల ఓపికకు పరీక్ష పెట్టాయి.
అందుకే ఇప్పుడు సగటు ప్రేక్షకుడి దృష్టి అంతా ద్వితీయార్ధంపైనే ఉంది. ముఖ్యంగా తెలుగు చిత్రపరిశ్రమ ఆశలన్నీ రానున్న నాలుగు వారాలపైనే పెట్టుకుంది. ఎందుకంటే ఈ నాలుగు వారాల్లోనే భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. అది కూడా స్టార్ హీరోల చిత్రాలు కావటం.. పాన్ ఇండియా స్థాయిలో వీటి నిర్మాణం జరగటమే ఇందుకు కారణం. అందుకే ఈ నాలుగింటిపై అన్ని చిత్ర పరిశ్రమల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దాదాపు రూ.1200 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకున్న ఈ చిత్రాలతోనే బాక్సాఫీస్ మళ్లీ ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయనేది నిపుణుల అంచనా. యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ‘వార్2’లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ హిందీ మార్కెట్‌లో పెద్ద హిట్ కొట్టే అవకాశముందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అయితే, అదే రోజు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ విడుదల కానుంది.
ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడు కాగా, టాలీవుడ్ స్టార్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇంకా ఉపేంద్ర, ఆమిర్‌ఖాన్ వంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందంటున్నారు సినీవర్గాలు. ఇక దాదాపు నాలుగేళ్లుగా చిత్రీకరణలోనే ఉన్న ‘హరిహర వీరమల్లు’ ఎన్నో అవాంతరాలు దాటుకొని జూలై 24న విడుదలవుతోంది. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే నాన్ -థియేట్రికల్ హక్కుల ద్వారా రూ.100 కోట్లు రాబట్టే అవకాశముంది.
మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్‌డమ్’పై కూడా భారీ అంచనాలున్నాయి. కొంత కాలంగా సరైన విజయాన్ని అందుకోలేక అసంతృప్తితో ఉన్న ఈ రౌడీ హీరో ఈ సినిమా ద్వారా రీబౌన్స్ కావాలని చూస్తున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై నిర్మాతలు భారీ హైప్ క్రియేట్ చేశారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విజువల్స్, టీజర్‌తోనే అటెన్షన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్‌కు ఊపిరి పోస్తుందన్న నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. మరి ఈ నలుగురి గురీ బాక్సాఫీస్‌పైనే ఉన్న ఈ తరుణంలో రికార్డు ఫలితాలు ఎవరిని వరిస్తాయో చూడాలి.
కనీసం రెండు హిట్ అయితే సరి!
టాలీవుడ్‌తోపాటు భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం విడుదలకు సిద్ధంగా ఉన్న నాలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది. ఈ నాలుగు సినిమాల మొత్తం బడ్జెట్.. దాదాపు రూ.1200 కోట్ల మేర ఉంటుందని తెలుస్తోంది. వీటిలో కనీసం రెండు సినిమాలు భారీ విజయాన్ని నమో దు చేసినా సాధింనా.. సినిమా పరిశ్రమకు గట్టి బూస్టప్ ఇచ్చే అవకాశముంది. రజనీకాంత్ ‘కూలీ’కి రూ.450 కోట్లు ఖర్చు చేయగా, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘వార్2’కు రూ.400 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్నట్టు తెలుస్తోంది. ఇక పవన్‌కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ బడ్జెట్ రూ.250 కోట్లు కాగా, విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’కు రూ.100 కోట్లు ఖర్చు చేశారని సమాచారం.