13-07-2025 01:11:13 AM
సిద్దిపేట, జూలై 12 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చాలెంజ్ చేశారు. రాష్ట్రంలో ఎండలు బాగా పెరిగినా, వర్షాలు లేక పత్తి చేనులు ఎండిపోయినా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మహారాష్ట్ర నుంచి గోదావరి నదిలో రోజుకు 80 టీఎంసీల నీరు వచ్చేస్తున్నా, మోటార్లు ఆన్ చేయకుండా నీళ్లు వృథా చేస్తున్నారని పేర్కొ న్నారు.
గట్టిగా మోటార్లు ఆన్ చేస్తే వారం రోజుల్లో రంగనాయకసాగర్ నిండిపోతుందనీ, మోటార్లు ఆన్ చేయకుండా రేవంత్ రెడ్డి రాజకీ యాలు చేస్తున్నాడన్నారు. శనివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ లాంటి ప్రాజెక్టులు కాళేశ్వరం కాదా? ఇవన్నీ చూస్తూ కూడా గోబెల్స్ ప్రచారంతో కాళేశ్వరం కూలిపోయిందంటున్నారు.
సత్తా ఉంటే, దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలని.. నువ్వేం చేసావో, మేమేం చేసా మో ప్రజల ముందు మాట్లాడుదాం అంటూ హరీశ్ సవాల్ విసిరారు. రైతులకు చెందిన పంట భూములకు రైతుబంధు సాయం మంజూరు కాకపోవడం, కొత్త భూములపై సాయం ఆపివేయడం, ఓట్ల కోసం పథకాలను వినియోగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నా ట్లకు నాట్లకు మధ్య రైతుబంధు ఇచ్చేవాడు.
కానీ రేవంత్ ఓట్లకు ఓట్లకు మధ్య ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ట్రాక్టర్లు, రైతు పరికరాలపై తక్షణ సాయం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘కేసీఆర్ ట్రాక్టర్లు కొన్నిచ్చాడు. కానీ రేవంత్ దానికి డీజిల్ పోసేందుకు పైసలు లేవని గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్నా’డంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటకు నష్టం జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు.