calender_icon.png 13 July, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక తోడేళ్లు

13-07-2025 12:32:24 AM

నో చలాన్.. ఓన్లీ క్యాష్

  1. వంగమర్తి ఇసుక రీచ్‌లో అక్రమాల పర్వం 
  2. ప్రభుత్వ పనుల పేరుతో దందా 
  3. ప్రైవేటు పనులకే ఇసుక తరలింపు 
  4. నిత్యం వందల లారీల్లో అక్రమ రవాణ
  5. ఒక్కో లారీకి రూ.65వేలకు పైనే 
  6. మూసీ నది వట్టిపోయే ప్రమాదం 
  7. పట్టించుకోని అధికార యంత్రాంగం

నల్లగొండ, జూలై 12 (విజయక్రాంతి): అక్రమ ఇసుక వ్యాపారానికి వంగమర్తి ఇసుక రీచ్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కళ్లేదుటే మూసీ వాగును కొళ్లగొట్టి రూ.కోట్లు వెనకెస్తున్నా.. పాలకులు, అధికారులు మాత్రం చోద్యం చూస్తుండడం గమనార్హం. ప్రభుత్వ పనుల పేరు చెప్పి నిత్యం వందలాది లారీల్లో ఇసుకను ప్రైవేటు పనులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇసుక తవ్వకాలు, తరలింపులో పాటించాల్సిన నిబంధనలను మూసీ వాగులో తొక్కేసి ఎంచక్కా హైదరాబాద్, నల్లగొండ, సూర్యాపేట తదితర ప్రాంతాలకు పెద్దఎత్తున లారీల్లో తరలించి అక్రమాలకు ఆజ్యం పోస్తున్నారు. తాము గెలిస్తే ఇసుక దోపిడీకి చెక్ పెడతానని చెప్పినోళ్లు సైతం అందులో భాగస్వామ్యులయ్యారనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వంగమర్తి వద్ద మూసీ నదిలో ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేశారు.

ఈ ఇసుక రీచ్ నుంచి నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టే పనులకు ఇసుకను తరలించాల్సి ఉంది. ఈ క్రమంలోనే నిత్యం రోజుకు 100 లారీల వరకు ఇసుక రీచ్ నుంచి బయటకు వెళ్లిపోతోంది. కానీ వే బిల్లులు మాత్రం కనీసం 10 లారీలకు ఉండడం లేదు. రీచ్ కాంట్రాక్టర్లు ప్రైవేటు పనులకు ఇసుకను పెద్దఎత్తున తరలించి రూ.కోట్లు సంపాదిస్తున్నారు.

ఒక్కో లారీ ఇసుకను హైదరాబాద్‌కు తరలించి రూ.65వేలకు విక్రయిస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, చౌటుప్పల్ ప్రాంతాల్లో మాత్రం ట్రిప్పు లారీ ఇసుకకు రూ.45వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ ఆదాయంలో ప్రభుత్వానికి పట్టుమని పది రూపాయాలు అందకపోవడం కొసమెరుపు.

దర్జాగా హైవేల మీదుగానే రవాణా

మూసీ నదిలోని వంగమర్తి ఇసుక రీచ్ జాతీయ రహదారి పక్కనే ఉంది. దీంతో ఇసుక అక్రమ తరలింపు ఈజీ అయిపోయింది. శాలిగౌరారంలోని వంగమర్తి రీచ్ వద్ద ఇసుక లోడ్ చేసుకునే లారీలు ఇటు విజయవాడ- -హైదరాబాద్ జాతీయ రహదారి, అటు వరంగల్-  రహదారిపైకి సులభంగా చేరుకుని గంటన్నర వ్యవధిలోనే హైదరాబాద్ నగరంలోకి ఎంటర్ అవుతున్నాయి.

విజయవాడ జాతీయ రహదారి మీదుగా వెళ్లాలంటే శాలిగౌరారం, నకిరేకల్, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చౌటుప్పల్ పోలీసు స్టేషన్లను దాటుకుని వెళ్లాలి. కానీ ఎక్కడా లారీలను చెక్ చేసే పరిస్థితి కన్పించడం లేదు. మరోవైపు వరంగల్ హైవే మీదుగా వెళ్లాలంటే అర్వపల్లి, తిరుమలగిరి, మోత్కూరు, వలిగొండ, భువనగిరి, బీబీనగర్ తదితర స్టేషన్లను దాటాలి.

ఇన్నీ స్టేషన్ల నుంచి వెళుతున్నా ఎక్కడా కనీస తనిఖీలు చేయకపోవడం వెనుక పెద్ద దందా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెల్లారిందంటే చాలు.. బైక్‌లు,ఆటోలు, ఇతర గూడ్స్ వెహికల్స్‌ను తనిఖీల పేరుతో ఆపి చలాన్ల మీద చలాన్లు విధించే పోలీసులు.. కండ్ల ముందే వెళుతున్న ఇసుక లారీలను మాత్రం ఎంచక్కా వదిలేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకొచ్చు.

అధికారులకు ప్రతి నెలా మామూళ్లు..

వంగమర్తి ఇసుక రీచ్ నుంచి అక్రమ ఇసుక దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ఈ దందా అంతా బహిరంగ రహస్యమే. కానీ ఏ ఒక్క అధికారి చర్యలు తీసుకునేం దుకు ముందుకు రావడం లేదు. జిల్లాలో రెవెన్యూ, మైనింగ్, పోలీసు, ఆర్టీఓ శాఖలు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. దీనికి కారణం ప్రతినెలా ఆయా అధికారులకు మాముళ్లు అందడమేనని తెలుస్తోంది.

తమ సొంత ఇంటి అవసరాల కోసం ట్రాక్టర్ ఇసుకను తీసుకెళ్తే నానా హంగామా చేసి కేసులు పెట్టే పోలీసు, రెవెన్యూ శాఖలు అక్రమ ఇసుక లారీలపై ప్రేమ చూపుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ఒక్కో అధికారికి ప్రతినెలా రూ.20వేలకు పైగా ముట్టజెబుతున్నట్టు సమాచారం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఇసుక అక్రమ దందా అడ్డుకట్ట వేయకపోతే.. మూసీ నది వట్టిపోయే ప్రమాదం లేకపోలేదు.

నో చలాన్.. ఓన్లీ క్యాష్..

మూసీ నదిలో వంగమర్తి ఇసుక రీచ్‌ను ప్రభుత్వ పనుల కోసం కేటాయించింది. కానీ ఇక్కడి ఇసుక మాత్రం హైదరాబాద్ నగరంలోని ప్రైవేటు బిల్డర్లు, కంపెనీలకు భారీగా తరలుతోంది. అయితే ఇక్కడి నుంచి చలాన్లు, వే బిల్లులు లేకుండానే లారీలు నిత్యం వందల సంఖ్యలో తరలివెళుతున్నాయి. పది లారీలకు వే బిల్లులు ఉంటే.. మిగతా 90 లారీలకు పైగా నిబంధనలకు విరుద్దంగా వెళుతుండడం ఇక్కడి ఇసుక రీచ్ ప్రత్యేకత అని చెప్పాలి.

దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. వే బిల్లుల ద్వారా ఇసుక తరలిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో జీరో దందా వల్ల సర్కారుకు పెద్దఎత్తున నష్టం వాటిల్లుతున్నది. వాగులో ఇసుక తరలింపునకు కొన్ని పరిమితులు, నిబంధనలు ఉన్నాయి. వీటిని ఏ ఒక్కరూ పాటించడం లేదు. వే బిల్లులకు మంగళం పాడడంతో స్థానిక గ్రామ పంచాయతీకి రావాల్సిన ఆదాయం కూడా పడిపోతుంది.

అయితే కొంతమందికే ఈ ఆదాయం లాభం చేకూరుతోంది. అక్రమార్కులను నిలువరించి ఇసుక వ్యాపారాన్ని అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే భూగర్భ జలాలు తగ్గిపోయి పంటల సాగుకు తీవ్రంగా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో వారందరికీ ప్రత్యేకంగా వాటాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువ దందా జరుగుతోందని వాపోతున్నారు.