13-07-2025 12:58:43 AM
న్యూఢిల్లీ, జూలై 12: స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో భారత్ కీలక ముందడుగు వేసింది. గగనతలం నుంచి గగనతలానికి దూసుకెళ్లే అస్త్ర క్షిపణిని విజ యవంతంగా ప్రయోగించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీతో దాన్ని ఆపరేట్ చేశారు. సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా అస్త్రను ప్రయోగించారు. వేర్వేరు రేంజ్‌ల్లో ఉన్న హైస్పీడ్ ఏరియల్ లక్ష్యాలను పేల్చారు.
రెండు సందర్భాల్లోనూ అస్త్ర క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలనే ఛేదించింది. అస్త్ర బీవీఆర్‌ఏఏఎం (బిహాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్) సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను పేల్చగలదు. అత్యుత్తమమైన గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థలు దీంట్లో ఉన్నాయి. అస్త్రా క్షిపణి తయారీలో సుమారు 50 పబ్లిక్, ప్రైవేట్ పరిశ్రమలు పాలుపంచుకున్నాయి. అస్త్ర ప్రయోగం విజయవంతమవడంతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో, ఐఏఎఫ్ సంస్థల కృషిని ఆయన కొనియాడారు.