11-05-2025 12:00:00 AM
సృజనాత్మకత అనేది ప్రపంచాన్ని కొత్త దృక్పథంతో చూసేలా చేస్తుంది. ఆయా అంశాలను భిన్న రీతుల్లో దర్శించటానికి తోడ్పడుతుంది. ఇది వయసుతో ముడిపడింది కాదు. వృద్ధుల్లోనూ ఎంతో సృజనాత్మక శక్తి దాగుంటుంది. విశిష్టమైన జీవితానుభవాలు దీన్ని మరింతగా తీరిదిద్దతూ వస్తాయి. స్వీయ వ్యక్తీకరణను ఆరంభించటానికి వృద్ధాప్యం ఒక మంచి అవకాశమని భావించేవారు ఎందరో. తమ మనసులోని భావాలను కొందరు కవితలు, కథలు, నవలలతో వ్యక్తీకరిస్తే.. మరికొందరు సంగీతం, కళాఖండాలతో వెలిబుచ్చుతారు. ఇది వృద్ధులకు ఎంతో మేలు చేస్తుంది. దాంతో కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..
మెదడు చురుకుగా..
సృజనాత్మకతతో ముడిపడిన పనులు మెదుడులోని చాలా భాగాలను ప్రేరేపితం చేస్తాయి. కదలికలకు తోడ్పడే భాగాల దగ్గరి నుంచి భావోద్వేగాలను విడమరచుకునే భాగాల వరకూ అన్నీ ఉత్తేజితమవుతాయి. రచనలు, చిత్రాలు గీయటం, కుట్లు, అల్లికలు, ఖళాకండాల రూపకల్పన.. చివరికి వంట చేయటమూ విషయగ్రహణ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఏకాగ్రత, విశ్లేషనాత్మక ఆలోచన మెరుగవుతాయి. ఫలితంగా వయసుతో పాటు విషయగ్రహణ సామర్థ్యం క్షీణించటం నెమ్మదిస్తుంది. మెదడు చురుకుగా, అప్రమత్తంగా ఉంటుంది. వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికిది ఎంతగానో తోడ్పడుతుంది.
ఇతరులతో అనుబంధం
పిల్లలకు వేసవి శిబిరాల మాదిరిగానే ఇప్పుడు పెద్దవారి కోసం వర్క్‌షాప్‌లు, తరగతులు నిర్వహిస్తున్నారు. ఇవి ఇతరులతో కలిసేలా చేయటం ద్వారా ఒంటరితనాన్ని పోగొడతాయి. ఒకరి నుంచి మరొకరు నైపుణ్యాలను నేర్చుకోవటం వల్ల కలిగే ఆనందం, సంతోషం మనసు మీద గణనీయమైన ప్రభావం చూపుతాయి. జీవితాన్ని కొత్త కోణంలో చూసేలా కూడా చేస్తాయి.
శారీరక ప్రయోజనాలు..
మానసికంగా, భావోద్వేగ పరంగానే కాదు.. సృజనాత్మకతో కూడిన పనులు శారీరకంగానూ మేలు చేస్తాయి. డ్యాన్స్, కుండలు చేయటం, శిల్పాలు చెక్కటం వంటివి పలు రకాలుగా ఉపయోగపడతాయి. లయబద్ధమైన కదలికలు కండరాలు, కీళ్లు బిగుసుపోకుండా కాపాడతాయి. శరీరం తూలి పోకుండా చూస్తాయి. బలాన్ని పెంపొందిస్తాయి. మొత్తంగా మానసికంగానే కాకుండా శారీరక ఆరోగ్యానికీ తోడ్పడతాయి.
జ్ఞాపకాల నెమరు
సృజనాత్మకతకు పదును పెట్టడం వల్ల జ్ఞాపకశక్తి ఉత్తేజితమవుతుంది. బాల్యంలోనో, యవ్వనంలోనో చూసిన ఘటనలు మనసులో మెదలుతాయి. జీవితానుభవాలను గుదిగుచ్చి భావితరాలకు అందించే ప్రయత్నం నిజంగా జ్ఞాపకాలను జల్లెడ పట్టడం లాంటిదే. కథలు రాసినా, చిన్నప్పుడు నివసించిన ఇంటి చిత్రం గీసినా, అప్పుడెప్పుడో పాడిన పాటలను కొత్తగా ఆలాపించినా అన్నీ జ్ఞాపకశక్తిని పెంచేవే. ఇవి విషయగ్రహణ సామర్థ్యాన్ని పెంచే వ్యాయామాలుగా ఉపయోగపడటంతో పాటు గత సంఘటనలను నెమరు వేసుకునే సాధనాలుగానూ తోడ్పడతాయి.
సాఫీగా, హాయిగా!
హాయిగా జీవించటాన్ని నిర్ధరించేది పుట్టిన తేదీతో ముడిపడిన వయసు కాదు.. బలమైన స్ఫూర్తేనని అర్థం చేసుకోవడం ముఖ్యం. దీన్ని ముందుకు నడిపించేది సృజనాత్మకతే. సహజ సిద్ధమైన కళాత్మక గుణాన్ని ప్రోత్సహించటం, స్వీకరించటం, ఎప్పటికప్పుడు పెంపొందించుకోవటం ద్వారా వృద్ధాప్యంలో జీవన గమనం సాఫీగా, హాయిగా సాగేలా చూసుకోవచ్చు. ఇది అద్వితీయమైన సంతృప్తిని కలిగిస్తుంది. జీవితానికో కొత్త లక్ష్యాన్ని చూపిస్తుంది. రోజులను ఆనంద భరితం చేస్తుంది. ఉద్యోగం నుంచి విరమణ తీసుకునే దశలో సృజనాత్మకత అనేది కేవలం ఒక అవకాశం మాత్రమే కాదు. సమగ్రమైన జీవనానికి వీలు కల్పించే మలి మార్గమని గుర్తించటం అవసరం.
పనేదైనా గానీ..
చిన్నదో, పెద్దదో.. సృజనతో కూడిన పనేదైనా గానీ పూర్తి చేశాక కలిగే సంతృప్తే వేరు. మనసంతా గొప్ప విజయాన్ని సాధించామనే ఆనందంతో నిండుతుంది. ఎంతో కష్టపడి అల్లిన స్కార్ఫ్ కావొచ్చు, గొప్ప మలుపులతో రాసిన కథ కావొచ్చు, చేత్తో తయారుచేసిన నగ కావొచ్చు, వివరణాత్మక చిత్రం కావొచ్చు. అన్నీ కూడా అంకిత భావం, ఆసక్తి, సంతరించుకున్న నైపుణ్యాలు, వెచ్చించిన సమయానికి ప్రతిఫలాలే. ఇవన్నీ విజయ భావన కలిగించేవే.
భావోద్వేగ నియంత్రణ
తమలో గూడు కట్టుకున్న భావాలు.. భయాలు.. ఆశలు.. ఆశయాలు.. స్వప్నాలు.. గత అనుభవాలను ఇతరులతో.. ప్రపంచంతో పంచుకోవటానికి కళలు మంచి సాధనాలుగా ఉపయోగపడతాయి. ఇలా భావోద్వేగాలను వెలిబుచ్చుకోవడం మంచి చికిత్సగానూ తోడ్పడుతుంది. ముఖ్యంగా తమతో తాము గాఢంగా మమేకమయ్యేలా చేస్తాయి. తమ గతంతో, చుట్టుపక్కల విశాల ప్రపంచంతో అనుసంధానిస్తాయి. తమను తాము వ్యక్తీకరించుకోవడటం వల్ల విచారం, బాధ, ఒత్తిడి భావనల నుంచి విముక్తి లభిస్తుంది. ఒంటరితనం, కుంగుబాటుతో ముడిపడిన ఆలోచనలు తగ్గుముఖం పడతాయి.