calender_icon.png 14 May, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి అందాలకు నెలవు.. డార్జిలింగ్!

11-05-2025 12:00:00 AM

డార్జిలింగ్.. పశ్చిమబెంగాల్‌లో సముద్రమట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉండే ప్రముఖ పర్యాటక ప్రాంతం. హిమాలయ పర్వత పాదాల్లో ఉండే ఈ ప్రాంతం.. బ్రిటీష్ కాలం నుంచే కాఫీ, టీ, పర్యాటకానికి, విడిదికి ప్రసిద్ధి. ఊటీ, కొడైకెనాల్, కర్నాటక పశ్చిమ కనుమలు, సిమ్లా, కశ్మీర్‌కు.. ఇక్కడి భౌగోళిక వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుంది. 

మిగిలిన ప్రాంతాలు ఏటవాలుగా ఉంటే.. ఇది మాత్రం నిట్టనిలువుగా ఉంటుంది. నేపాల్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్‌లకు మధ్యలో ఉంటుంది. భారతదేశాన్ని కలిపే సిలిగురి, డార్జిలింగ్ చాలా దగ్గరగా ఉం టాయి. వేసవిలో రాత్రిపూట కనిష్టంగా 6 డిగ్రీలు.. పగలు గరిష్టంగా 28 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయం టే ఈ ప్రాంతం ఎంత చల్లగా ఉంటుందో అర్థం చేసుకోవ చ్చు. ఈ ప్రాంతానికి 1814 దశకంలోనే బ్రిటీష్ వారు చేరుకున్నారు. తర్వాత గుర్ఖా రాజును ఓడించి ఈస్టిండియా కంపెనీ తమ వలస ప్రాంతంగా మార్చుకుంది. ఈ ప్రాంతం బ్లాక్ ఫర్మెంటెడ్ టీకి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. 

సంస్కృతి, సంప్రదాయాలు

ఈ ప్రాంతం నేపాల్‌కు చాలా సమీపంలో ఉంటుంది. పర్వతం అంచుకు వెళ్తే నేపాల్ కనిపిస్తుంటుంది. ఇక్కడ దాదాపు గుర్ఖాలే ఉంటారు. వారి మాతృభాష నేపాలీనే. మెజారిటీ హిందువులు, తర్వాతి స్థానంలో బౌద్ధులు ఉంటారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో నివసించే వారిలో 99 శాతం వ్యాపారులే.

హోటల్, వాహనాలు, రిటైల్, వస్త్ర వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. మైదాన ప్రాంతం నుంచి నీరు, కూరగాయలు, సరుకులు, గ్యాస్ ప్రతిరోజూ పర్వతంపైకి రవాణా చేస్తారు. అందుకే ఇక్కడ ధరలు కాస్త అధికంగానే ఉంటాయి. గణపతి, శివుడి ఆలయాలు అధికం. బౌద్ధ దేవాలయాలు, అక్కడక్కడా బ్రిటీష్ వారి కాలంలో నిర్మించిన చర్చీలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఉంటే ప్రధాన వర్గం నేపాలీ గుర్ఖాలు, షెర్పాలు తదితర వర్గాలు ఉంటాయి.

తేయాకు తోటలు..

అస్సాం టీ లాంటి అరుదైన రకాలకు డార్జిలింగ్ చిరునామ. మనోహరమైన టీ తోటలకు.. కాంచన్‌జంగా దృశ్యాలతో పర్యాటకులను కనువిందు చేస్తుంది. ఈ రకాలకు యురోప్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండేది. ఇక్కడ తేయాకు తోటల పెంపకాన్ని బ్రిటీష్ వారు పెద్ద ఎత్తున చేపట్టారు. స్థానికంగా ఉండే గుర్ఖా, షేర్పా ప్రజలు.. వివిధ తెగల ప్రజలను కూలీలుగా నియమించుకుని విస్తారంగా సాగు చేసేవారు. దాదాపు 200 ఏళ్లుగా తేయాకు తోటల వ్యాపారం కొనసాగుతున్నది. 

ఎలా వెళ్లాలి?

హైదరాబాద్ నుంచి డార్జిలింగ్‌కు రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విమానంలో శంషాబాద్ నుంచి బాగ్‌డోగ్రా విమానాశ్రయం వరకు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి డార్జిలింగ్ తేయాకు తోటలకు దాదాపు 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాగ్‌డోగ్రాలో డార్జిలింగ్ కొండలపైకి చేరుకునేందుకు ట్యాక్సీలు ఉంటాయి. ఒంటరిగా వెళ్లేవారు, ఔత్సాహికుల కోసం బైకులు కూడా కిరాయికి లభిస్తాయి.