11-08-2024 03:23:46 AM
హైదరాబాద్/మహబూబ్‌నగర్ ఆగస్టు 10 (విజయక్రాంతి): అమరరాజా గ్రూప్ మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామ సమీపంలో శనివారం లిథియం బ్యాటరీ ప్యాక్ ప్లాంటును ప్రారంభించింది. దీనితో పాటు అనంతరం గిగా కారిడార్లో కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం అమరరాజా ఎనర్జీ, మొబిలిటీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జయదేవ్ గల్లా మాట్లాడుతూ యువతకు తమ పరిశ్రమలో అర్హతను బట్టి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యతను ఇస్తామని చెప్పారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు.
అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ పూర్తి సబ్సిడరీ అయిన అమరరాజా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ నెలకొల్పిన ఈ బ్యాటరీ ప్యాక్ ప్లాంట్ తొలిదశలో 1.5 గిగావాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంటుకు పియాజియోతో అమరరాజా ఒక ఎంఓయూను కుదుర్చుకున్నది. రూ.9,500 కోట్ల పెట్టుబడితో 16 గిగావాట్ల సామర్థ్యంతో లిథియం బ్యాటరీ తయారీ ప్లాంటును, 5 గిగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్‌ను మహబూబ్‌నగర్‌లో నెలకొల్పేందుకు గతంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఎంఓయూపై అమరరాజా సంతకాలు చేసింది.
లిథియం బ్యాటరీ తయారీని తొలిదశలో 8 నుంచి 10 గిగావాట్లతో ప్రారంభించాలని యోచిస్తున్నట్టు జయదేవ్ గల్లా తెలిపారు. క్వాలిఫికేషన్ ప్లాంటు వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రారంభమవుతుందని చెప్పారు.