ఐఎన్‌సీ అంటే.. ఇటలీ నేషనల్ కాంగ్రెస్!

27-04-2024 01:47:00 AM

l బ్రిటీషోళ్లు స్థాపించిన పార్టీ అది.. 

l గాంధీ కుటుంబం ఒక డూప్..  

l ఇటలీ నేత చేతిలో పగ్గాలు

l బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్

కరీంనగర్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ‘ఐఎన్‌సీ అంటే.. ఇటలీ నేషన్ కాంగ్రెస్.. పార్టీని ఏవో హ్యూమ్ అనే బ్రిటీష్ సివిల్ సర్వెంట్ స్థాపించారు. మహాత్మాగాంధీ అసలు సిసలైన గాంధీ. ఆ పార్టీని ఇప్పుడు ఇటలీ నేత నడుపుతున్నార’ని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. మానకొండూరులో శుక్రవారం ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దళిత సమ్మేళనం’లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌లో భారతీయత లేదని, బీజేపీ అంటే భారతీయ ఆత్మ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరు చనిపోయినా వారి ఆస్తిలో 55 శాతాన్ని గుంజుకుంటుందని ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన శ్యాం పిట్రోడానే స్పష్టం చేశారని గుర్తుచేశారు. మోదీ హయాంలోనే శాంతిభద్రతలు ఉన్నాయని, దేశం సురక్షితంగా ఉందన్నారు. సమావేశంలో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మాజీ అధ్యక్షుడు కొప్పు భాష, ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్,  నాయకులు సురేష్, శ్రీనివాస్, సొల్లు అజయ్‌వర్మ , సోమిడి  వేణుప్రసాద్ , రాపాక ప్రవీణ్, వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలను ఓట్లడగండి

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీల పట్ల వ్యతిరేకతతో ఉన్నారని, బీజేపీ నేతలు ఎన్నికల్లో ప్రచారంలోకి వెళ్లినప్పుడు మోదీ విజయాలను వివరించి వారిని ఓట్లడగాలని పార్టీ ఎంపీ అభ్యర్థి బండిసంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో శుక్రవారం మండలాల పార్టీ అధ్యక్షులు, ఇంచార్జులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిని తమ పార్టీ కార్యకర్తలే గుర్తుపట్టరని, ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఎప్పుడు.. పార్టీలో చేరారో.. ఎప్పుడు టికెట్ సాధించారో కూడా కార్యకర్తలకు తెలియదన్నారు. పార్టీ కార్యకర్తలంతా పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఇంటికీ మూడుసార్లు వెళ్లి ఓటు అభ్యర్థించాలని సూచించారు. ప్రతిఒక్కరూ పోలింగ్‌కు హాజరయ్యేలా చూడాలన్నారు. ఈసారి 80 నుంచి 100 శాతం ఓటింగ్ జరిగేలా కృషి చేయాలన్నారు. ఈనెల ఆది, సోమవారాల్లో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేయాలని కోరారు.