calender_icon.png 17 August, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విడువని వాన

17-08-2025 01:01:52 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో రాష్ట్రంలోని పలు జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై వరుణుడి ప్రభావం ఎక్కువగా ఉంది. నిర్మల్ జిల్లా కడెం నదిలో ఓ మత్స్యకారుడు చేపలు పడుతుండగా.. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో వరద ప్రవాహం పెరిగి గల్లంతయ్యాడు.

సీతగొంది గ్రామంలోని ఓ ఇంటిని వరదలు చుట్టు ముట్టగా.. అందులో ఉన్న ఆరుగురిని డీఆర్‌ఎఫ్ సిబ్బంది తాళ్ల సాయంతో రక్షించారు. జైనథ్ మండలం తర్ణం వాగులో సైతం 2 లారీలు వరద ఉధృతిలో చిక్కుకుపోయాయి. మంచిర్యాల జిల్లాలో వర్షం కారణంగా ఓపెన్ కాస్టులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం లోని కొత్తగూడలో రహదారులపై పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో రహదారులు జలమయమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ.. 29.6 అడుగులకు చేరుకున్నది. నాగార్జునసాగర్‌కు వరద కొనసాగుతుండ టంతో 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి వదులుతున్నారు.