17-08-2025 12:42:40 AM
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): తెలంగాణలో ‘మార్వాడీ వ్యాపారు లు గో బ్యాక్’ నినాదం తెరమీదకి రావడానికి స్థానిక వ్యాపారులు పలు కారణాలను చెబుతున్నారు. అన్నింటా వారే ఉన్నారని, అన్ని వ్యాపారాలు వారివేనని చెబుతున్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన మార్వా డీ వ్యాపా రస్తులు.. ఇప్పుడు గ్రామాలకు కూడా పాకారనే ఆరోపణలు చేస్తున్నారు. స్వీట్ హౌజ్, మాల్స్, హోటల్స్, కిరాణా షాపులు, ఎలక్ట్రికల్స్, బంగారు దుకాణాలు, వస్త్ర దుకాణాలన్నీ వారివే. ఆఖరికి టీ స్టాళ్లలోనూ వారే పోటీగా ఉం టున్నారనే విమర్శలున్నాయి.
దీంతో స్థానికంగా ఉండే వ్యాపారస్తులు వారి నుంచి పోటీని ఎదుర్కొన లేకపోతున్నారనే వాదనలూ వినిపిస్తున్నా యి. పైగా స్థానికులు దుకాణాలు పెట్టు కుంటే ఇక్కడి వారికే పని కల్పిస్తారు. కానీ అదే మార్వాడీలు తమ వర్గం వారినే పెట్టుకోవడంతో పాటు ఇక్కడి దుకాణాదారులను మోసం చేస్తున్నారని ఆరో పిస్తున్నారు. తొలు త వీరెక్కువగా హోల్ సేల్ వ్యాపారాలే చేసేవారు.
కానీ కొంతకాలంగా రీటైల్ వ్యాపార రంగంలోనూ వచ్చే శారు. నాసిరకం సరుకులు, జీరో దందా చేస్తూ ట్యాక్స్ లు కట్టరనే ఆరోపణలున్నాయి. తెలంగాణకు వచ్చి కోట్ల ల్లో ఆస్తులను కూడబెట్టుకుంటుం టే, తాము ఎప్పటికీ ఎదగలేక పోతున్నామనే అభిప్రాయాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
18న ఆమన్‌గల్ బంద్
మరోవైపు హోల్‌సేల్ మార్వాడీ వ్యాపారస్తులు స్థానికులకు ఎక్కువ రేట్లకు సరుకు లు ఇచ్చి, మార్వాడీలకు మాత్రం తక్కువ రేట్లకు అమ్ముతున్నారని చెబుతున్నారు. ఈక్రమంలోనే ఈ ఉద్యమం తెరపైకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులెవరూ మార్వాడీ దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేయొద్దని డిమాండ్ పెరుగుతోంది. మార్వాడీలకు వ్యతిరేకంగా ఈ నెల 18న స్థానిక వ్యాపారులు రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ మండలం బంద్‌కు పిలుపునిచ్చారు.
ఉద్యమ బాటగా మారిన పాట
అయితే ఈ ఉద్యమం పురుడు పోసుకోవడానికి ఓ ప్రధాన కారణమే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో కారు పక్కకు జరపాలని కోరినందుకే మార్వాడీలు ఓ దళితుడిపై దాడి చేశారు. ఈ ఘటనతో వారి దోపీడిని వివరిస్తూ గోరేటి రమేశ్ అనే వ్యక్తి ఓ పాట రాశారు. మార్వాడీలకు వ్యతిరేకంగా రమేశ్ పాడిన పాట వైరల్ కావడంతో అది తీవ్ర చర్చకు దారితీసింది.
దీనిపై ఫిర్యాదు చేయడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. అయితే గతంలో గోరేటి రమేశ్ ప్ర జానాట్యమండలిలో పనిచేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనతో కలిసి పనిచేసినవారు, ప్రజాస్వామ్యవాదులు ఆయన అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మర్వాడీలు చేస్తున్న దోపిడీని ఎండగట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
అసలు ఈ ఉద్యమం వెనుకాల ఏదో రాజకీయ లబ్ధి ఉందనే అభిప్రాయాలను మేధా వులు, రాజకీయ విశ్లేషుకులు వ్యక్తం చేస్తున్నారు. కావాలనే స్థానికత సెంట్‌మెంట్‌ను రగిలిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. రెండు వర్గాలుగా విభజించి రాజకీయంగా ఎవరికివారు మద్దతు కూడగట్టుకోవాలని ఇలా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
సమాజంలో అందరూ భాగస్వాములే!
తెలంగాణ రాష్ర్టం ఇప్పుడే కాదు, కొ న్ని దశాబ్దాల నుంచి దేశంలోని అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుంటోం ది. ఈ ప్రాంతమనే కాదు ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా సమాజంలో అందరూ భాగస్వాములే. తెలంగాణ ప్రాంతం జీవించడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడంతోనే ఇక్కడ అన్ని కుల, మత వర్గాల వారు ఉండటానికి ఇష్టపడతారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్ప డ్డాక కూడా ఇంకా ఇక్కడ ఆంధ్రా వాళ్లు జీవిస్తున్నారు.
వ్యాపారాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో ఒక్క మార్వాడీలే కాదు. సిక్కులు ఇతర మతస్తులూ వివిధ వ్యాపారాలు చేసుకుంటూ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామలవుతున్నారు. అందరిలాగే తామూ వ్యాపారాలు ఇక్కడ చేసుకుంటున్నామని మార్వాడీల వాదన. తాము ఎవ్వరినీ మోసం చేయడంలేదని, కష్టపడి పనిచేసుకుంటున్నామని, కావాలనే కొందరు తమపై ఉసిగొల్పుతు న్నారని చెబుతున్నారు.
వీరు ఎక్కువగా హైదరాబాద్‌లో అమీర్‌పేట్, బేగంపేట, ఓల్డ్‌సిటీ, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజ్‌గిరి, కోటి, అబిడ్స్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలలో విస్తరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వీరు ఉన్నారు. ఇక్కడనే కు టుంబాలను ఏర్పాటు చేసుకొని ఆధార్, ఓటర్ ఐడీ కార్డులు కల్గి ఈ ప్రాంతం వారితో కలిసిమెలసి ఉంటున్నారు.
ఇతర రాష్ట్రాల్లోనూ తెలంగాణ వాళ్లు నివసిస్తున్నారు. మరీ అక్కడి వారు కూడా తెలంగాణ వాళ్లను వెళ్లిపోవాలని ఉద్యమాలు చేస్తే ఎలా అనే ప్రశ్నలను లేవనె త్తుతున్నారు. మార్వాడీల వల్ల తెలంగాణ రా ష్ట్రానికి ఆదాయం వస్తోందని, అందరిలా గే జీవించే హక్కు వీరికీ ఉందనే అభిప్రాయాలను మేధావులు వ్యక్తం చేస్తున్నారు.
మార్వాడీలకు అండగా బీజేపీ
అయితే మార్వాడీలకు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ నాయకురాలు మాధవీలత నిలుస్తున్నారు. ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇటీవల ఘాటుగానే స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ, ‘మార్వాడీ గో బ్యాక్’ పేరు తో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని మం డిపడ్డారు. ‘మార్వాడీ గో బ్యాక్’ అంటే..
మటన్ దుకాణా లు, డ్రై క్లీనింగ్ దుకాణాల పేరుతో ఒక వర్గం వారు నిర్వ హించే కులవృత్తులకు వ్యతిరేకంగా తాము ఉద్యమించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు నాటకాలు ఆడు తున్నాయని మండిపడ్డారు. మార్వాడీలు వ్యా పారం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. వారు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదని, తెలంగాణను దోచుకోలేద ని, వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారని పేర్కొన్నారు. వారం తా హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని, అలాంటి వారు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలని ప్రశ్నించారు.
రోహింగ్యాలకు వ్యతిరే కంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన అన్నారు. రాజాసింగ్ సైతం మార్వాడీల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా చేస్తున్నారని ఇటీవల ఒక వీడి యో విడుదల చేశారు. మార్వాడీలు వారి తాతముత్తాతల కాలం నుంచి ఇక్కడే నివసిస్తు న్నార ని, వారి వ్యాపారాలు వారు చేసుకుంటున్నారని తెలిపారు.
మరోవైపు మాధ వీలత ఇటీవల మీడియాతో ట్లాడుతూ రాష్ట్రంలో లక్షన్నర మంది రోహింగ్యాలున్నారని, వారిపై మా ట్లాడే దమ్ము ఉందా అని మిగతా పార్టీ నాయకులకు ప్రశ్నించారు. వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. కలిసి ఉన్న దేశాన్ని విడగొడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురాణ బస్తీల్లో హిందువులు కలిసి మెలసి ఉన్నారంటే అక్కడ మార్వాడీ, రాజస్తానీల వల్లనే అని అన్నారు. ఇది భారత దేశం.. ఇక్కడ అందరూ ఉంటారని పేర్కొన్నారు.