17-08-2025 01:22:55 AM
ఏదైనా సాధించాలనే పట్టుదలతో ముందుకెళుతూ సమాజంలో గుర్తింపు తెచ్చుకొంటున్న మహిళలనే అందరూ కామెంట్ చేస్తారంటున్నారు బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్. ‘కంగనా ఎప్పుడూ పెళ్లయిన మగవాళ్లనే టార్గెట్ చేస్తారు’ అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె తాజాగా ఇలా స్పందించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. డేటింగ్ కల్చర్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు.
“వయసు లో ఉన్న అమ్మాయిలు ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉన్నప్పుడు, పెళ్లయి పిల్లలున్న వ్యక్తి మీతో సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నిస్తే అది మగవాడి తప్పు కాదు. మీరు పెళ్లయిన వాళ్లతో సంబంధం పెట్టుకోవడం మీ తప్పు అని జనం ఎప్పుడూ మహిళను తప్పుగా చూస్తారు. ఇలాంటి సందర్భాల్లో అమ్మాయి తప్పు చేసినట్లే, మగవాడూ తప్పు చేశాడని ఎవరూ అనుకోరు” అని కంగనా తెలిపారు.
ఆమె ఇంకా డేటింగ్ యాప్స్ వాడకం గురించి మాట్లాడుతూ.. “ఇవి సమాజంలో మురికి కాలువ లాంటివి. ఆత్మవిశ్వాసం లేనివారు, ఎవరో ఒకరి గుర్తింపు కోసం చూసేవాళ్లే ఇలాంటివి వాడుతారు. పెద్దలు కుదిర్చిన వివాహం ద్వారానైనా లేదా చదువుకునే టైమ్ లో అయినా అమ్మాయిలు తమ భాగస్వాములను వెతుక్కోవాలి. లివ్-ఇన్ రిలేషన్లు అమ్మాయిలకు సురక్షితం కాదు. ఇలాంటి రిలేషన్‌లో అమ్మాయిలకు గర్భం వస్తే కుటుంబం నుంచి సరైన తోడు ఉండదు” అని చెప్పుకొచ్చారు కంగనా.