అసమర్థ సీఎం
- ఓటుకు నోటు కేసు కారణంగానే మెట్రో ఫేజ్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు
- 71 సార్లు ఢిల్లీకి వెళ్లినా రేవంత్‌రెడ్డిని బీజేపీ పట్టించుకోవడం లేదు
- ప్రధానిని ప్రశ్నించలేక ప్రతిపక్షంపై నిందలు
- సీఎం ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి
- హైదరాబాద్ మెట్రో పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌దే
- స్వార్థ ప్రయోజనాల కోసం మెట్రో రెండో దశ ప్రతిపాదన
- ఎల్ అండ్ టీపై బెదిరింపులతో మెట్రో రైల్ ఆస్తులు కొల్లగొట్టే కుట్ర
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతి దక్కకపోవడం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శన మని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ప్రకటనలో విమర్శించారు. 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ, మీ ’బడేభాయ్’ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేకపోవడం ఆయన చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనమని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్రంపైన, ముఖ్యంగా ప్రధాన మంత్రిని విమర్శించే ధైర్యం రేవంత్‌రెడ్డికి లేదన్నారు. తనపై నమోదైన ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
అందుకే కేంద్రంలోని బీజేపీని కాకుండా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీని విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం రేవంత్‌రెడ్డి చేస్తున్నారని అన్నారు. బీజేపీతో రేవంత్‌రెడ్డికి ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లనే ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి తన చేతగానితనానికి హైదరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెట్రో ఫేజ్- ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి ఇన్ని కుప్పిగంతులు తొక్కుతున్నారని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మెట్రో రైల్ ఘనత కేసీఆర్‌దే
ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్ని చూస్తున్నట్టుగా చూస్తున్నారని చెప్పుకున్నప్పుడే మీ నిజస్వరూపం బయటపడిందని, బీఆర్‌ఎస్ పైన, కేసీఆర్‌పైన పడి ఏడవడం తప్ప మీకు ఏ పని చేతకాదని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ’మినీ ఇండి యా’ లాంటి హైదరాబాద్‌లో మీకు, మీ పార్టీకి పుట్టగతులు ఉండవని కేటీఆర్ హెచ్చరించారు.
నాడు కాంగ్రెస్ పాలనలో 28 శాతం మెట్రో పను లు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన పరిస్థితుల్లో, 2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రం సహకరించకపోయినా, రుణాలు సాధించి మెట్రోను పరుగులు పెట్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.
మెట్రో ఆస్తులు కొల్లగొట్టే కుట్ర
హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ పట్ల అద్భుతమైన విజయంతో అనేక ప్రణాళికలను గత ప్రభుత్వం రూపొందించింది అన్నారు. రేవంత్ రెడ్డి మాదిరి స్వార్థ ప్రయోజనాల కోసం అసలు ఉనికిలో లేని ఊహాజనిత నగరానికి మెట్రో తీసుకువెళ్లాలన్న మాదిరి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలోచించలేదు అన్నారు. కేవలం ప్రజల ప్రయోజనాలు సౌకర్యం కోసమే దృష్టిలో ఉంచుకొని మెట్రో ఫేజ్-2ను ఆరు కారిడార్లు, 72 స్టేషన్లతో 76.4 కిలోమీటర్ల మేర డిజైన్ చేసింది కేసీఆరేనని, నలుదిశలా ఆరు రద్దీ రూట్లలో ప్రణాళికలు రచిస్తే, వాటిని పనికిరాని రూట్లు అంటూ ప్రజల్ని అవమానిస్తారా అని సీఎంను కేటీఆర్ నిలదీశారు.
రెండున్నరేళ్లలో ఫేజ్-2ను అటకెక్కించడం మీ వైఫల్యమని, అధికారంలోకి రాగానే శంషాబాద్ మెట్రోను రద్దు చేసిన ద్రోహం మీదేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెట్రో ఫేజ్ ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించలేదని ఎందుకు బుకాయిస్తున్నారని ప్రశ్నించిన కేటీఆర్, ఏకంగా ఎల్ అండ్ టీ సీఎఫ్‌ఓ నే బెదిరించి, పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ పెట్టినట్లుగా భ యబ్రాంతులకు గురిచేసి పారిపోయేలా చేసింది మీరే కదా అని ప్రశ్నించారు. 30 వేల కోట్ల మె ట్రో ఆస్తులను, నడిబొడ్డున ఉన్న మెట్రో భూములను కొల్లగొట్టేందుకే సంస్థను వెళ్లగొట్టే కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు.






