20 August, 2026 | 1:19 AM

అసంపూర్తి కల్వర్టు పనులు వెంటనే పూర్తి చేయాలి

20-08-2026 12:20 AM

అధికారులకు సూచించిన ఎమ్మెల్యే జీఎంఆర్

అమీన్ పూర్, ఆగస్టు 19 : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్ర స్థాయిలోనే తెలుసుకొని, వాటికి శాశ్వత పరిష్కారం చూపడమే తన ప్రధాన లక్ష్యమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్ పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ సాయికృపా కాలనీలో బుధవారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో నేరుగా సమావేశమై, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించారు. కాలనీలో నిర్మాణంలో ఉన్న కల్వర్టు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. కల్వర్టు నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాలనీలో నూతన సీసీ రోడ్లు, యూజీడీ వ్యవస్థల నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్ మల్లేష్, సీనియర్ నాయకులు జగదీష్, గోపాల్, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.