calender_icon.png 18 December, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియా.. ఇథియోపియా బంధం బలోపేతం

18-12-2025 01:16:32 AM

  1. రెండు దేశాలు.. అభివృద్ధి చెందుతున్న దేశాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ

‘వందేమాతరం’ గీతాలపనతో మోదీకి సాదర స్వాగతం

ఆయనకు ఆ దేశ అత్యున్నత పురస్కార ప్రదానం

అడ్డిస్ అబాబా, డిసెంబర్ 17: ఇండియా.. ఇథియోపియా మధ్య బంధం మరింత బలోపేతం అవుతున్నదని, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భారతదేశం, ఇథియోపియా ఎదుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం ఆయన ఇథియోపియా పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ.. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా, రెండు దేశాలు ఒకరికొకరు నేర్చుకోవాల్సి ఉందన్నారు. శాంతి, భద్రతలు, సామరస్య స్థాపనలో రెండు దేశాలు సహజ భాగస్వాములని కొనియాడారు. సింహాలకు నిలయమైన ఇథియోపియాలో అడుగుపెట్టడం తనకు ఆనందాన్నిచ్చిందన్నారు.

తనకు సొంత గడ్డపై ఉన్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. తన స్వస్థలమైన గుజరాత్ కూడా ఏషియన్ సింహాలకు నిలయమని, అది తనకు గర్వకారణమని తెలిపారు. ఇరు దేశాల జాతీయ గీతాలు ప్రజల్లో మాతృభూమి పట్ల గర్వాన్ని, దేశభక్తిని ప్రేరేపిస్తాయన్నారు. రెండు దేశాల మధ్య రెండు వేల ఏళ్ల నాటి చారిత్రక, వాణిజ్య సంబంధాలను గుర్తుచేశారు. ఆధునిక కాలంలో ఇథియోపియా విముక్తి కోసం భారత సైనికులు కూడా పోరాడారని గుర్తుచేశారు. ముఖ్యంగా వేలాది మంది భారతీయ ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దారని వ్యాఖ్యానించారు.

వారు ఇథియోపియా ప్రజల హృదయాలను గెలుచుకున్నారని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో భారత్ 150కి పైగా దేశాలకు మందులు, వ్యాక్సిన్లు పంపిందని, అందులో భాగంగా ఇథియోపియాకు 4 మిలియన్లకు పైగా డోసులు అందించడం గర్వకారణమని అన్నారు. అనంతరం మోదీ చారిత్రక అద్వా యుద్ధ విజయ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. 

మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం 

ప్రధాన మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ మోదీని వరించింది. ఈమేరకు ఆ దేశ ప్రధాని అబే అహ్మద్ అలీ చేతుల మీదుగా మోదీ పురస్కారాన్ని అందుకున్నారు. భారత్ ఇథియోపియా భాగస్వా మ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన కృషికి, ప్రపంచ నేతగా ఆయన దార్శనిక నాయకత్వానికి గుర్తింపుగా పురస్కారాన్ని అందించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకు న్న తొలి ప్రపంచ దేశాధినేత లేదా ప్రభుత్వాధినేత ప్రధాని మోదీ కావడం విశేషం.

‘వందేమాతరం’ ఆలపించిన ఇథియోపియన్లు

15 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి గౌరవ సూచకంగా ఇథియోపియాకు చెందిన కళాకారులు, గాయకులు భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆలపించారు. ఈ అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వందేమాతర గీతాలపన తర్వాత ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని అబీ అహ్మద్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.