calender_icon.png 18 December, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బంగ్లా’ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

18-12-2025 01:14:56 AM

  1. ‘సెవెన్ సిస్టర్స్’ను ఒంటరి చేస్తామన్న ఆ దేశ ఎన్సీపీ నేత అబ్దుల్లా 
  2. వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సీరియస్
  3. ఢిల్లీలోని హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ 

న్యూఢిల్లీ, డిసెంబర్ 17 : భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా బంగ్లాదేశ్‌కు చెందిన నేషనల్ సిటీ పార్టీ (ఎన్సీపీ) నేత హస్నత్ అబ్దుల్లా ఇటీవల వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌ను అస్థిరపరిస్తే ‘సెవెన్ సిస్టర్స్’ను ఒంటరిని చేస్తామని అబ్దుల్లా ఢాకాలోని ఓ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చిచ్చురేపుతున్నాయి. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా స్పందించింది. బుధవారం ఆ దేశ హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. 

బంగ్లా మాజీ ప్రధానికి ఆశ్రయం కల్పించారని..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడాన్ని అబ్దుల్లా తప్పుబట్టారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించని వారికి అండగా నిలిస్తే, తాము కూడా భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే వేర్పాటువాద శక్తులకు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో అస్థిరత ఏర్పడితే, ఆ అగ్ని జ్వాలలు సరిహద్దులు దాటి భారతదేశానికి కూడా వ్యాపిస్తాయంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

భారత్ భద్రతా పరమైన ముప్పుగా ..

భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి వేరు చేసేలా బంగ్లాదేశ్ తన వ్యూహాలను అమలు చేయగలదని అబ్దుల్లా పేర్కొనడం కలకలం రేపింది. అస్సాం, మేఘాలయ, త్రిపుర తదితర రాష్ట్రాలు బంగ్లాదేశ్‌తో సుదీర్ఘ భూ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ వేర్పాటువాద శక్తులను ప్రోత్సహిస్తామనే బంగ్లాదేశ్ హెచ్చరికను భారత్ భద్రతా పరమైన ముప్పుగా భావిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా భారత్ తమపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోందని అబ్దుల్లా ఆరోపించారు.

సంబంధాలను దెబ్బతీస్తాయని..

ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో మారుతున్న రాజకీయ పరిణామాలు, భారత్ పెరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు పొరుగు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని దౌత్యవేత్త అభిప్రాయపడ్డారు. అస్థిరతను సృష్టించే శక్తులకు చోటు ఇవ్వొద్దని, బాధ్యతాయుతమైన రీతి వ్యవహరించాలని భారత్ ఈ సందర్భంగా బంగ్లాదేశ్ రాయబారికి స్పష్టం చేసింది.