01-09-2025 07:13:11 PM
ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
హన్మకొండ,(విజయక్రాంతి): కాజీపేట సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని 31 వ డివిజన్ న్యూ శాయంపేట సుర్జిత్ నగర్ లో కారు ఉపేందర్ అధ్యక్షతన కాలనీవాసులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన చుక్కయ్య మాట్లాడుతూ... కాజీపేట మండలంలోని 31 డివిజన్ న్యూశాయంపేట ప్రాంతంలోని సూర్జిత్ నగర్ లో గత 20 సంవత్సరాలుగా సర్వేనెంబర్ 579 ప్రభుత్వ భూమిలో 500 కుటుంబాలు ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నారు. కరెంటు మీటర్లు, ఇంటి నెంబరు వచ్చాయి. అదేవిధంగా ఓటర్ ఐడి, గుర్తింపు కార్డులు కూడా ఈ ఇంటి నెంబర్ పైనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడం వలన అనేక సంక్షేమ పథకాలు వీరికి అందకుండా ఉంటున్నాయి.
పట్టాలు ఉంటేనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది కాబట్టి ఇంటి నెంబర్ కలిగి ఉన్న ఇంటి యజమాని పేరు మీద నమోదు చేసి, జీవో నెంబర్ 58 ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, పట్టా లేకున్నా ఇంటి నెంబర్ కలిగి ఉన్న ప్రతి స్థలానికి ఇల్లు మంజూరు చేసే విధంగా ఈ డివిజన్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కమిటీకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా సిపిఎం పార్టీ కోరుతుందన్నారు. లేనిచో ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యే వరకు కాలనీవాసులు అందరినీ ఐక్యం చేసి రాబోవు కాలంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.