26-05-2025 01:20:02 AM
సిరిసిల్ల, మే 25 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల మం జూరు పత్రాలు పొందిన వారంతా త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆదివారం రెండో విడత కింద 764 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వులు సిరిసిల్ల జూనియర్ కళాశాల మై దానం ఆవరణ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్, కే కే మహేందర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.ఇంటి స్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సిరిసిల్లలో 764 మందిని పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి ఉత్తర్వులు పంపిణీ చేశామని తెలిపారు.
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని, 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేసుకోవాలని స్పష్టం చేశారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తున తర్వాత లక్ష రూపాయల, గోడలు నిర్మిస్తే లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తరువాత 2 లక్షల రూపాయలు,ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ వెల్లడించారు.
మంజూరు పత్రాలు ఇవ్వడం సంతోషం
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణికి ప్రజలు వచ్చి తమకు ఇండ్లు ఇప్పించాలని కోరేవారని కలెక్టర్ గుర్తు చేశారు. అలాంటి పేదలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఇవ్వడం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వం అందించే సహాయాన్ని పొంది తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూపారెడ్డి, సెస్ ఛైర్మెన్ చిక్కాల రామారావు, హౌసింగ్ పీడీ శంకర్, డిఆర్డిఓ శేషాద్రి, మున్సిపల్ కమిషనర్ వాణి,సంబంధిత అధికారులు, ఇందిరమ్మ కమిటీ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.