26-05-2025 01:54:49 AM
మహబూబాబాద్, మే 25 (విజయక్రాంతి): నాగరిక సమాజంలో ఓ వైపు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నా.. ఇంకా కొందరు ఆడపిల్లల పట్ల వివక్ష చూపుతూ అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ అని తెలియగానే కొందరు పేగు బంధాన్ని తెంచుకుంటున్న ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి.
కొందరు గర్భంలోనే పిండాన్ని తొలగించుకుంటుండగా, మరికొందరు పుట్టిన తర్వాత ఆడబిడ్డను భారంగా భావించి వదిలించుకుంటున్న ఘటనలు ఇటీవల మితిమీరిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజుల క్రితం అలాంటి ఘటన ఒకటి మళ్ళీ బయట పడింది. కొందరు వైద్యులు కాసులకు కక్కుర్తి పడి చట్ట విరుద్ధమైన గర్భవిచ్చితి కార్యక్రమానికి సహకరిస్తున్నారు.
గ్రామాల్లో ఇందుకోసం కొందరు ఆర్.ఎం.పి వైద్యులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ భ్రూణ హత్యలకు దోహదపడుతున్నారు. నిబంధనల ప్రకారం గర్భిణీకి స్కానింగ్ నిర్వహించిన నిర్వాహకులు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అన్న విషయాన్ని చెప్పకూడదని, చెబితే చట్ట పరమైన శిక్షకు గురికావాల్సి ఉంటుందని తెలిసినా పెడచెవిన పెట్టి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి పుట్టబోయే బిడ్డ ఆడో మగో చెబుతున్నారు. ఫలితంగా ఆడపిల్లల జనన సంఖ్య తగ్గిపోయి లింగ నిష్పత్తి కి పెను ప్రమాదంగా మారింది.
మానుకోటలో వరుస ఘటనలు
లింగ నిర్ధారణ పరీక్షలు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తూ పుట్టబోయే బిడ్డ ఆటో మగో బహిరంగ పరుస్తున్న ఘటనలు మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల అనేకం చోటు చేసుకుంటున్నాయి. కురవి మండలం పిల్లిగుండ్ల తండాలో గత ఏడాది ఓ ఇంట్లో ల్యాబ్ టెక్నీషియన్ సొంతంగా స్కానింగ్ పరికరాన్ని ఏర్పాటు చేసి, గ్రామీణ వైద్యుల ద్వారా గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడించిన ఘటన జరిగింది.
ఈ ఘటన బయటకు పొక్కి పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అక్కడికి వెళ్లి వారిని పట్టుకుని కేసు నమోదు చేశారు. అంతకుముందు తొర్రూరు, నర్సంపేట, వరంగల్, హనుమకొండ, నెక్కొండలో ఇలాంటి ఘటనలె వెలుగు చూసాయి. పలువురు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, అబార్షన్ల ఘటనలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లి వచ్చారు.
తాజాగా నెల్లికుదురు మండలానికి చెందిన గర్భిణికి భర్త వరంగల్ జిల్లా నెక్కొండ లోని ఓ స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్ష చేయించి పుట్టబోయేది ఆడ బిడ్డ అని తెలుకొని తన భార్యకు గర్భ విచ్ఛిత్తి చేయాలని మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ వైధ్యున్ని ఆశ్రయించాడు. అయితే అబార్షన్ చేయించుకోవడం సరైన విధానం కాదని, చట్ట విరుద్ధమైన చర్య అని తల్లితండ్రులకు చెప్పాల్సిన వైద్యుడు కాసులకు కక్కుర్తిపడి, తన వృత్తి ధర్మాన్ని విస్మరించి ఆ గర్భిణికి అబార్షన్ చేయడానికి అంగీకరించాడు.
గర్భ విచ్ఛిత్తి కోసం ఇచ్చిన మాత్రలు వేసుకున్న గర్భిణికి తీవ్రంగా రక్త స్రావం కావడంతో పరిస్థితి విషమంగా మారింది. దీనితో ఈ విషయం బయటకు పొక్కడంతో విషయం తెలుసుకున్న ప్రభుత్వ వైద్యాధికారులు ఆమెను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా బిడ్డ మరణించగా, తల్లి కోలుకుంటోంది.
ఇలాంటి ఘటనలు ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. మానుకోట జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో అబార్షన్ కేసులు ఎక్కువగా నిర్వహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఆర్.ఎం.పి వైద్యులు కీలకం విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు
నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ యంత్రాలను రహస్య ప్రదేశాల్లో ఏర్పాటుచేసి, లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే దంపతులను ఆర్.ఎం.పి వైద్యుల ద్వారా సంప్రదించి, లింగ నిర్ధారణ చేసి, పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ అయితే అబార్షన్ చేయడానికి కూడా ప్రత్యేకంగా ప్యాకేజీ మాట్లాడుకుని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి.
లింగ నిర్ధారణకు 5 నుంచి 10 వేలు, అబార్షన్ కైతే 30 నుంచి 50 వేల వరకు ప్యాకేజీ మాట్లాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అన్ని తామే చూసుకుంటామని, ఎక్కడ కూడా విషయం బయటకు రాదని నమ్మబలుకుతూ, అమాయకులను గర్భవిచ్చితికి ముందుకు వచ్చేలా ప్రోత్సహిస్తూ ఆడబిడ్డలను గర్భంలోనే హతమారుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్ట విరుద్ధం
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం మన దేశంలో చట్ట విరుద్ధం. పీ సీ పీ ఎన్ డీ టీ చట్టం 1994 ప్రకారం గర్భిణీ మహిళలకు శిశువు లింగ నిర్ధారణ చేయడం నిషేధించబడింది. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, చేయించుకున్నా, అబార్షన్ చేసినా ఆయా ఘటనలకు పాల్పడ్డవారికి మూడు నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, పదివేల నుంచి లక్ష వరకు వరకు జరిమానా, లైసెన్స్ రద్దు, వైద్యశాల, డయాగ్నొస్టిక్ సెంటర్ మూసి వేయవచ్చు.
అయితే ప్రభుత్వం లింగ నిర్ధారణ అంశంలో పటిష్టమైన చట్టాన్ని రూపొందించినప్పటికీ, అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారన్నడానికి ఇలాంటి దుష్టంతాలు సజీవ సాక్షాలుగా నిలుస్తున్నాయి.
ముగ్గురిపై కేసు నమోదు
మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసిన భ్రూణ హత్య ఘటన నేపథ్యంలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ సిఐ దేవేందర్ తెలిపారు. జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్ ఫిర్యాదు మేరకు లింగ నిర్ధారణ పరీక్ష చేసిన నెక్కొండ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు, సహకరించిన ఆర్‌ఎంపి వైద్యుడు, అబార్షన్ చేయడానికి అంగీకరించిన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాల నిర్వాహకుడి పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు చెప్పారు.