calender_icon.png 26 September, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా ఇందిరమ్మ గృహ ప్రవేశాలు

26-09-2025 01:10:04 AM

ప్రారంభోత్సవాలు చేసిన రూరల్ ఎమ్మెల్యే, కలెక్టర్

నిజామాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేశారు. వేద బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా పూజలు జరిపించి, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులైన మానస, స్వరూప, నిశాంత్, సాయిరాం, గంగాధర్ లను వారి కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశాలు చేయించారు.

రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ గృహ ప్రవేశాలు కావడంతో ఎమ్మెల్యే భూపతి రెడ్డి లబ్దిదారులకు తన తరపున స్వయంగా నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ లు లబ్ధిదారులకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో సొంతింటి కల సాకారం చేసుకోగలిగామని లబ్దిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

కాగా, లబ్దిదారులకు పూర్తి స్థాయిలో బిల్లులు అందాయా? ఇంటి నిర్మాణం విషయంలో అధికారులు తోడ్పాటును అందించారా? అని కలెక్టర్ లబ్దిదారులను ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్, తాగునీరు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీరిని స్పూర్తిగా తీసుకుని మిగతా లబ్దిదారులు కూడా త్వరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ఇళ్లను కట్టుకోవాలని, అనవసర ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కాకూడదని కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతి నిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.