17-11-2025 01:46:28 AM
ఆంధ్ర రాష్ర్టంలో బందీగా వుంటూ వచ్చిన తెలంగాణను విముక్తం చేసి స్వీయాధికార పీఠంపై ప్రతిష్ఠింప చేసిన ఘనచరిత పాట. తెలంగాణ పల్లె ప్రజల నాలుకలపై నిత్యం నాట్యమాడే పాటకు వున్న శక్తి అంతటిది. యావత్ తెలంగాణ జనం ఏకతాటి పైకి వచ్చి సమష్టిగా తలపెట్టిన స్వరాష్ర్ట సాధనోద్యమానికి వెన్నుదన్నుగా నిలవడంతో ఆగక ముందుండి నడి పించిన కథానాయకి పాట. నిరంతరం కదులుతూ కదిలించడం పాటకు వెన్నతో పెట్టిన విద్య.
శ్రమజీవి శరీర అవయవాల కదలికలో స్వాభావికంగా వుండే లయ, అంతర్లయలకు లోబడి పుట్టిందే పాట. అందుకే నృత్యం తో పాటకు ఆజన్మ అనుబంధం. నీరే కాదు పాట కూడా పారుతుంది. పారడం దాని సహజ గుణం. తెలంగాణ సాధించే దిశగా సుదీర్ఘకాలం సాగిన మహోద్యమం మునివాకిట అందుకే అది నిప్పులవాగై పారింది. నిప్పు లు చిమ్ముకుంటూ నింగికి ఎగసింది. మహెగ్ర పాంచభౌతిక శక్తిగా ఎదిగి, ప్రచండంగా వెలిగి తన కర్తవ్యాన్ని పరిపూర్తి చేసింది.
ఇంతా చేసి పాటకు సాహితీ సీమలో సముచిత స్థా నం దక్కలేదు. ఇంతటి ఘన చరిత గుర్తింపునకు నోచుకోలేదు. ప్రజల భాషలో, జానపదుల మార్గంలో, దేశ సంప్రదాయంలో ప్రభవించిన పాట చిరకాలంగా చిన్న చూపునకు గురవుతున్నది. ఈనాడే కాదు ఏనాటి నుం చో పాటను అడుగడుగునా అవమానించారు. సాహితీ ప్రాంగణం వెలుపల నిలబెట్టారు.
పెద్ద దర్వాజ లోనికి ప్రవేశం లేదన్నారు. పాటను అంటరానితనం వీడలేదని చెప్పడానికి ఈ నాటికీ నిలువెత్తు సాక్ష్యాలు కొల్లలుగా వున్నాయి. పాటను రాసేవాళ్ల సామాజిక హెదా, పుట్టుకతో సంక్రమించే తలకిందుల హెదా, కులవ్యవస్థ నిర్దేశిం చిన అసమ సాంస్కృతిక హెదా పాటను వెంటాడింది. వర్ణవివక్ష పాటను కాటేసింది. కబళించింది. అందుకే పాటకు కవిత్వం హోదా కుదరదని ఏకపక్షంగా ప్రధాన స్రవంతి ముసుగులో తీర్మానించారు. పాట ప్రయోజనం పరిమితమైనదని ఒక అబద్ధాన్ని పుక్కిట పట్టారు, నొక్కివక్కాణించారు.
చెవితో వినే పాట కన్నా, కంటితో చదివే కవిత గొప్పదని బహిరంగంగానే చాటుకున్నారు. కవిత్వం కూడా చెవితో చిరకాలం విన్నదేనని మరచారు. కంటి కన్నా చెవి పాతది, పురాతనమైనదనే వాస్తవాన్ని విస్మరించారు. ఈనాటికీ ఉర్దూ, హిందీ కవులు తమ కవిత్వాన్ని వేలాదిగా వుండే శ్రోతలకు వినిపిస్తారనే సంగతి తెలిసి కూడా తెలియనట్టు నటించారు. ఈనాటికీ నటిస్తున్నారు. కవిత్వాన్ని ఉత్తర భారత కవులు లయాత్మకంగా పాడుతారనే నిజాన్ని గుర్తెరగనట్లు వ్యవహరిస్తున్నారు. ఆదికవి వాల్మీకి తన రామాయణ కావ్యాన్ని ఆలపించేవాడనే ‘పౌరాణిక’ సత్యాన్ని మనని ఏమార్చి పరిమార్చారు.
కుశల వులు ఆదికావ్యాన్ని నోరారా పాడారని ప్రతీతి. పాటకు ప్రచురణారత, కవితకు శ్రవ్యారత లేకుండా చేసి సంబరపడ్డారు. విప్లవ వాగ్గేయకారుడు గద్దర్ సమగ్ర పాటల/ కవిత్వ సంకలనం ఈనాటికీ వెలుగు చూడకపోవడం ఇందుకు సజీవ తార్కాణం. పాటను విని మరచి పోవాలని, కవిత్వాన్ని పుస్తక రూపంలో దాచుకుని చదువు కోవాలని వీరి ఉద్దేశం. వాస్తవానికి కంటి కన్నా చెవి శక్తిమంతం. పంచేంద్రియాలలో నయనం కన్నా శ్రవణం ప్రాచీనమైనది. కంటితో చదవడం కొత్తగా అలవర్చుకు న్న అలవాటు. చెవితో వినడం స్వాభావికం.
సహజా తం. కంటితో కనలేనిదాన్ని చెవితో విని పసిగట్టడం ఆదిమ మానవునికి పుట్టుకతో అబ్బిన విద్య. కంటితో చదివిన కవిత్వం అర్థం కానప్పుడు, చెవితో వింటే వెనువెంటనే అర్థం కావడం అనేది అందరి అనుభవంలో వున్నదే. డిలన్ థామస్ కవిత్వం చదివితే అర్ధం కానివా రు ఆయ న స్వయంగా చదివిన ఎల్పీ రికార్డు విని అర్థం చేసుకున్న సందర్భాలు ప్రపంచ పాఠకసభలో అనేకం. చెవికి వున్న శక్తి అంతటిది. తెలుగునాట కవి సమ్మేళనాలకు కొదవ లేకున్నా వాటి ప్రభావం అత్యల్పం.
కవిత్వా న్ని కవి చదువుతుంటే లేదా పాడుతుంటే విని ఆనందించే, ఆస్వాదిం చే సంస్కారం ఇక్కడ అలవడలేదు. కవిత్వపుస్తకాలను మధ్య తరగతి పాఠకులు (కవులు సహా) తమ తమ స్వగృహాల్లోని డ్రాయింగ్ రూమ్లో అలంకరించుకుని, అరుదుగా లేదా తరచుగా చదువుకోవడం మినహా, కవిత్వాన్ని శ్రవణ మాధ్యమాల ద్వారా వినడం లేదు. వినాలనే తలంపు లేదు. ఆ తలంపు వారికి రావడం కూడా లేదు. పాట మాదిరే కవి త్వం కూడా విన్నప్పుడే రక్తంలో ఇంకుతుందనే గొప్ప నిజాన్ని కనిపెట్టలే కపోయారు.
చివరికి రుగ్వేదం కూడా పాడితే విన్న దే. అదీ మరచారు. వేదాలను శృతం అని ఊరకే అనలేదు. పాటకు మానవ ప్రస్థానంలో వున్న మహోన్నత స్థానాన్ని ఇకనై నా సవినయంగా గుర్తించాలి. పాట వినా లి, చదవాలి. కవిత్వం చదవాలి, వినాలి. పాటను కవిత్వ ఆది రూపంగా, నిత్య నూతన కళారూపంగా, అతి ప్రాచీన సంగీత రూపంగా, ప్రాణశక్తి ప్రదా యినిగా గుర్తెరగాలి.
సంగీతం అక్షరాన్ని వెదుక్కుంటే పుట్టిందే పాట. కవిత్వం కూడా అంతే. సంగీతం లేకుండా పాటే కాదు. కవిత్వం కూడా లేదు, ఉండదు. కానీ మన వచన కవులు ఈ సంగతిని ఏనాడో మరచిపోయారు. వచన కవిత్వానికి కవికి తెలియకుండానే లయ వుం టుంది. ఆధుని క యూరోపియన్, అమెరికన్ కవులు తమ కవిత్వాలను లయాత్మకంగా గానం/పఠనం చేశారు. ఆసక్తి వున్న వారు వినొచ్చు.
ఆధునిక తెలుగు కవిత్వంలో ఒకే ఒక్కడు పైడి తెరేష్ బాబు తన కవిత్వాన్ని (హిందూ మహా సముద్రం’-లఘుకా వ్యం) పుస్తక రూపంలో ముద్రించక, శ్రవణ మాధ్య మంగా సీడీ రూపంలో వెలువరించాడు. ఇది జరిగి సుమారు ఇరవై ఐదు ఏండ్లు, మళ్లీ మరొక కవి ఈ పని ఇన్నేళ్లు గడచినా తలపెట్టిన దాఖలాలు లేవు.
చదవడం కన్నా వింటేనే తన కవిత్వం ఫలిస్తుందని, ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని ‘పైడి’ భావించాడు. వచన కవిత్వానికి పాట హోదా కల్పించేందుకు పూనుకున్నాడు. బడికి వెళ్లని / వెళ్లలేని, చదవడం రాని ప్రజలకు తన కవిత్వాన్ని చేరువ చేయాలనే సంకల్పం, సదాశయం ‘పైడి’ని ఇందుకు పురిగొల్పాయి.
మరోవైపు పాటను కవిత్వంగా గుర్తించక తప్ప ని స్థితి ఇటీవల అంతర్జాతీయంగా నెలకొన్నది. అమెరికన్ పాప్ సింగర్ / లిరిసిస్ట్ బాబ్ డిలన్‌న్ను ఐదేళ్లనాడు నోబెల్ బహుమతి వరించింది. పాటలు రాసే, పాడే పాప్ సింగర్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం ఏమిటని కవులు ముక్కున వేలేసుకున్నా రు. ఇది తమకు జరిగిన తీరని అన్యాయం అం టూ వాపోయారు. విమర్శలను ఎక్కుపెట్టారు. కా నీ యావత్ ప్రపంచ ప్ర జానీకం నోబెల్ కమిటీ నిర్ణయాన్ని వేనోళ్ల కొనియాడింది.
ఫలితంగా క వుల నోళ్లు మూతబడక తప్పలేదు. “నేను సంగీతజ్ఞుడినే, కాదనను. కానీ ప్రధానంగా నేను కవిని” అని బాబ్ డిలన్ ‘నోబెల్” సందర్భంగా బహి రంగ ప్రకటన చేశాడు. బాబ్ డిలన్కు ముందు, సుమారు యాభై ఏండ్ల క్రితం అతి విశిష్టుడైన అమెరికన్ సింగర్ జిమ్ మోరిసన్ ఇదే ప్రకటన చేయడం విశేషం. పాటలు రాసేవాళ్లు, రాసి పాడేవాళ్లు అంటే వాగ్గేయకారులూ కవులే, వారు రాసిందీ కవిత్వమేనని బాబ్ డిలన్ వెల్లడి చేసిన ప్రకటన చెప్పకనే చెప్పింది.
ఇది ఒక అనూహ్య పరిణామం. పాటలు రాసే, పాడే ‘పాటక’ జనానికి విద్యాధికులైన కవుల సరసన చోటు దక్కేలా చేసిన ఈ సానుకూల పరిణామం ప్రభావం తెలుగు నాట దాదాపు శూన్యం. 1913 లో నోబెల్ బహుమతి పొందిన మన దార్శనిక కవి రవీంద్రనాథ్ టాగోర్ సైతం గేయకవి కావడం గమనార్హం. టాగోర్ కవిత్వం బెంగాలీ భాషలో పాడుకుంటారే తప్ప మనమాదిరి చదవరు. ఆధునిక, సమకా లీన తెలుగు కవులు ఈనాటికీ గద్దరు, గోరటి వెంకన్నను కవులుగా గుర్తించ నిరాకరిస్తున్నారు.
తెలుగులో ఆధునిక కవిత్వం ఆది లో పాటకు ప్రతిరూపంగానే వెలువడిందనేది విస్మరింప వీలుకాని వాస్త వం. గురజాడ ‘పూర్ణమ్మ కథ’, దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘కృష్ణపక్షం’, పురిపం డా ‘పులిపంజా’, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ గీతాలు/గేయాలుగా వెలువడిన సంగ తి జగద్విదితం.
గురజాడ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల రచనలు అన్నిటికన్నీ పాడుకోవడానికి యోగ్యమైనవని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విశ్వనాథ ‘కిన్నెరసాని’ సరేసరి. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి ‘శివతాండవం’, విద్వాన్ విశ్వం ‘పెన్నేటి పాట’ కూడా పాడుకోవడానికే సృజించినవే. అదేవిధంగా నండూరి సుబ్బారా వు ‘ఎంకిపాటలు’, కొనకళ్ల వెంకటరత్నం ‘బంగారిమామ’ పాటలు. చివరికి శ్రీరంగం నారాయణ బాబు ‘రుధిరజ్యోతి’ కవితలు కూడా ‘పాట’కు లోబడినవే.
తన కవితలను నారా యణబాబు స్వయంగా పాడేవారని చెబుతారు. అంటే ఏమిటి? ఆధునిక తెలుగు కవిత్వానికి మూలకందాలుగా వున్న కవితా సంకలనాలు, కావ్యాలన్నీ సంగీత ప్రధానమేకాక, పాటకు అను సృజన కూడా. ప్రతిభావంతులైన గే యకవులు అడవి బాపిరాజు, బాలాంత్రపు రజనీకాంతరావు, బోయి భీమ న్న, ఎస్వీ భుజంగరాయశర్మ వంటివారు, ఎందరో రాసిన పాటలకు సా హితీ ప్రాంగణంలో చోటు నిరాకరించడం ఏ విధంగా న్యాయమో అర్ధం కాదు.
అన్నివేళలా పాటకు సాహితీ గౌరవం దక్కకుం డా చూడటమే తమ విధి అనుకున్నారు, మన ఆధునిక సాహిత్య ఘనాపాఠీలు. తెలంగాణ పాటకు వున్న ప్రత్యేకత, అది ప్రజలు నిత్యం తమ ఇంటిలో, పనిచేసే చోట, పొలంలో మాట్లాడుకునే భాషలో ఉండటం, ప్రజల నాలుకలపై నడయాడే ఈ జీవ భాషకు మేధావులు ‘మాండలికం’ అని పేరు పెట్టారు. తెలంగాణలో ఈ మాండలికం ఒకటి కాదు, అనేకం.
తెలుగు భాషా కుటుంబంలోని కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాల లో పాట ఈనాటికీ ప్రజల భాషలో వెలువడటం లే దు. అక్కడ పాట ఇంకా విద్యాధికుల ‘వ్యవహారిక’ భాషలోనే పుడుతున్నది. పుట్టి గిడుతున్నది. మధ్యతరగతి పరిమితికి లోబడి కాలంచెల్లిన గేయ / గీత సంప్రదాయంలో కొట్టుమిట్టాడుతున్నది. అభ్యుదయ, విప్లవ, దళిత పాటలు, గీతాలు అన్నీ అక్కడ పత్రికా భాషలోనే ఉండటం గమనార్హం. అక్కడ ప్రజలు లేరా అంటే ఉన్నారు.
కానీ వారికి అక్కడి సాహిత్యంలో పాట సంగతి పక్కన పెడితే కనీసం గేయ సాహిత్యంలో ప్రవేశం లేదు. ఇది చెప్పరాని దురవస్థ. పేరేన్నికగన్న కవులు శివసాగర్, కలేకూరి ప్రసాద్ (యువక), కోప్ర (కోలపూడి ప్రసాద్) రాసిన పాటలు ఇందుకు నిదర్శనం. తెలంగాణలో గత ఏడు దశాబ్దాలుగా ప్రజల జీవభాషలో వెల్లువెత్తుతున్న పాట అక్కడి కవులను ప్రభావితం చేయకపోవడం విచిత్రమే కాదు భయానకం కూడా!
తెలంగాణ ఉద్యమ పాట బృహద్రూపం ‘నిప్పులవాగు’. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పాటల నుంచి (యాదగిరి, సుద్దాల హనుమంతు, దాశరథి, కాళోజీ ఇత్యాదులు) మొదలై తొలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పాటల మీదుగా (ముచ్చర్ల సత్యనారాయణ, అనుముల శ్రీహరి, జి.వి. జగదీశ్వర స్వామి మరికొందరు) మలిదశ పోరాట పాటల దాకా విస్తరించిన ఈ పాటల వాగులో, మలిదశ ఉద్యమ వచన కవిత్వానికి స్థానం కల్పించడం సముచితంగా వుంది.
పాటతో వచన కవిత ముఖాముఖి పోటీ పడే సందర్భాన్ని తెలంగాణ రాష్ర్ట ఉద్యమం సృష్టించింది. వచన కవులు ఉద్యమం అందించిన ఈ అవకాశాన్ని ఫలవంతం చేశారంటే అతిశయోక్తి కాదు. వచన కవిత విభాగంలో కె. శ్రీనివాస్ అప్పట్లో రాసిన ‘కొంచెం నీరు కొంచెం నిప్పు’ కవిత హైలైట్‌గా నిలిచింది. సిద్ధార్థ, వేముల ఎల్లయ్య, ఎస్. జగన్రెడ్డి, జూకంటి, నందిని సిధారెడ్డి, దెంచనాల, మునాసు వెంకట్, గాజోజు రాసిన తెలంగాణ ప్రాతినిధ్య కవిత్వం ఇందులో చోటు చేసుకున్నది. మలిదశ ఉద్యమ పాటలు ఉద్యమ కాలపు వేడి, వాడి స్ఫురణకు తెచ్చాయి.
గద్దర్, గూడ అంజయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, సిధారెడ్డి, మిత్ర, జయరాజ్, మల్లావఝల సదాశివుడు వంటి సినియర్ల పాటలను ఈ సంకల నం ప్రముఖంగా వెలువరించింది. నేర్నాల కిషోర్, దయా నర్సింగ్, వరంగల్ శ్రీనివాస్, సురా, కోదారి శ్రీను, అంబటి వెంకన్న, మిట్టపల్లి సురేందర్, కందికొండ, నిస్సార్ వంటి ప్రతిభావంతులైన మలితరం కవుల పాటలు ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. వీరేకా క ఇంకెందరినో ‘నిప్పులవాగు’ తన అక్కున చేర్చుకున్నది.
‘మత్తడి’, ‘పొక్కిలి’, ‘మునుం’ సంకలనాల తరువాత అత్యంత సమగ్రంగా వెలువడుతున్న ‘నిప్పులవాగు’ తెలంగాణ ఉద్యమ పాటను భావితరాల కోసం నిక్షిప్తం చేస్తున్నది. ఇంతటి గురతర బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న అందెశ్రీని ఎంత అభినందించినా తక్కువే.
అసలు విషయానికి వస్తే, తెలంగాణ రానైతే వచ్చింది. కానీ తెలంగాణ పాట ఉన్న పళాన తెరమరుగై పోయిం ది. స్వరాష్ట్రాన్ని తద్వారా స్వయంపాలనను సాధించిపెట్టిన పాట మౌనం పాటిస్తున్నది. పాట కంఠం మూగవో యింది. పాట నిశ్చేష్టగా మారి దిక్కులు చూస్తున్నది. పాట ఆసాంతం తన ఉనికినే కోల్పోయే దుర్భర సన్నివేశం ఎల్లెడలా ఎదురవుతున్నది. ఎందుకు? అసలేం జరి గింది! ఎందుకు జరిగింది ఈ ఘోరకలి! ‘నిప్పులవాగు’లోని పాట కవులు, వచన కవులు, అంతా ఎక్కడ మాయ మయ్యారు? మచ్చుకైనా ఎందుకు కానరావడం లేదు.
సర్కార్ సేవలో సర్వస్వం కోల్పోయారా?! పదవులు, అవార్డులు, జీతభత్యాలు దిగమింగినయా మిమ్మల్ని! సర్వస్వతంత్రుడైన కవికి ఇది భావ్యమా! తెలంగాణ జన జీవనానికి, జన గానానికి దూరం కావడం న్యాయమా! ఆలోచనకు, పునరాలోచనకు ఇదే అదను.
“పాటలే ముందుండి ప్రజలను నడిపినవి పాటలే పెట్టని కోటలై నిలిచినవి పాటలే కోటి కంఠాలయ్యి మ్రోగినవి పాటలే కద రాష్ర్ట పట్టాభిషేకాలు పాట భిక్షే కదా! మీరేలె పదవులు గుండె గుండెన గండ దీపమై వెలిగిన పాటనవమానించ పదవులహంకారమా ఏందిరా.... ఏందిరా... తెలంగాణము ఎలా మూగబోయింది జనగానము” - అందెశ్రీ
(అందెశ్రీ ‘నిప్పులవాగు’.. తెలంగాణ ఉద్యమ పాటల పుస్తకానికి రాసిన ముందుమాట)