07-11-2025 12:22:21 AM
హైదరాబాద్, నవంబర్6 : నిర్దేశించిన చారిత్రక కట్టడాల వద్ద మెట్రో నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో నిర్మాణ విషయంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. మెట్రో నిర్మాణాల వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని, పురావస్తు అనుమతి కూడా తీసుకోలేదని ఏపీడబ్ల్యూఫ్ పిటిషన్ దాఖలు చేసింది.
చారిత్రక కట్టడాల సమీపంలో ఎలాంటి పనులు చేపపట్టొద్దని నిబంధనలున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపించారు. పాతబస్తీ అభివృద్ధికి మెట్రో ఎంతో కీలకమని కోర్డుకు వివరించారు. మెట్రో రెండో దశ డిజైన్, నిర్మాణ పనుల గురించి ప్రధాన న్యాయమూర్తి ఏఏజీని ప్రశ్నించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు రెండో దశ మెట్రో పనులు చేపట్టినట్లు ఏఏజీ వివరించారు.
అభివృద్ధి పనులను అడ్డుకోవడానికే పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం నిర్మాణ పనులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని కోరింది. నిర్దేశిత చారిత్రక కట్టడాల వద్ద మెట్రో నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.