01-11-2025 12:26:42 AM
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమై మార్చి 18 వరకు కొనసాగుతాయని తెలిపింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభమై మార్చి 17 వరకు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 26న మొదలై మార్చి 18న ముగుస్తాయి.
ఇక ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం అవుతాయని, ఈ పరీక్షలు ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయని పేర్కొంది. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష, జనవరి 22న ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష జరగనున్నాయి. ఒకవేళ ప్రాక్టికల్ పరీక్ష తేదీలు, జేఈఈ మెయిన్స్ పరీక్ష తేదీలతో క్లాష్ అయితే జేఈఈ మెయిన్స్‌కు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఇంటర్ ప్రాక్టికల్ రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది.
బ్యాక్‌లాగ్ విద్యార్థులకు జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను రెండు సెషన్‌లలో నిర్వహించనున్నారు. శనివారం, ఆదివారం కూడా పరీక్షలు ఉంటాయని తెలిపింది. సమయం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.
ఇక వార్షిక పరీక్షల సమయం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. వొకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను వేరుగా విడుదల చేస్తామని బోర్డు తెలిపింది. ఈసారి దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఫస్టియర్ ప్రధాన పరీక్షలు మార్చి 12న, సెకండియర్ పరీక్షలు మార్చి 13న ముగియనున్నాయి.
నవంబర్ 14 వరకు ఫీజుల చెల్లింపు
నవంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ.100 అపరాధ రుసుముతో నవంబర్ 16 నుంచి 24 వరకు, రూ.500 ఫీజుతో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 1 వరకు, రూ.1000తో డిసెంబర్ 3 నుంచి 8 వరకు, రూ.2వేలతో డిసెంబర్ 10 నుంచి 15 వరకు కట్టుకోవచ్చు. అయితే ఫస్టియర్ జనరల్ రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.530తోపాటు ఇంగ్లిష్ ప్రాక్టికల్‌కు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
ఫస్టియర్ వొకేషనల్ విద్యార్థులు 530 థియరీ ఫీజు, ప్రాక్టికల్‌కు రూ.240, ఇంగ్లిష్ ప్రాక్టికల్‌కు రూ.100 మొత్తం 870 చెల్లించాలి. సెకండియర్ జనరల్ ఆర్ట్స్ విద్యార్థులు రూ.530తోపాటు ఇంగ్లిష్ ప్రాక్టికల్‌కు రూ.100 చెల్లించాలి. సెకండియర్ జనరల్ సైన్స్ విద్యార్థులు థియరీ పరీక్షలకు రూ.530, ప్రాక్టికల్స్‌కు రూ.240, ఇంగ్లిష్ ప్రాక్టికల్‌కు రూ.100 కలిపి మొత్తం రూ.870 చెల్లించాల్సి ఉంటుంది. సెకండియర్ వొకేషనల్ విద్యార్థులు సైతం రూ.870 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్ పరీక్ష ఫీజు రూ.110 పెంపు
ఇంటర్ పరీక్ష ఫీజును అధికారులు ఈసారి పెంచారు. వార్షిక పరీక్ష ఫీజు గత ఏడాది రూ.520 ఉండగా, దాన్నిప్పుడు రూ.530 చేశారు. అలాగే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ పరీక్షలకు గతేడాది ఫీజును వసూలు చేయలేదు. కానీ, ఈసారి ఫస్టియర్ వాళ్లకు రూ.100, సెకండియర్ వాళ్లకు రూ.100 ఫీజును పెంచారు.