08-09-2025 07:08:06 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సమాజంలో విద్య ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి వివరించి విద్య అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇంచార్జ్ జిల్లా విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. సోమవారం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నుండి ర్యాలీని ప్రారంభించి జిల్లా కేంద్రంలోని కొమరం భీం చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా మార్కెట్ నుండి నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... సమాజంలో ఐక్యత, సామాజిక బాధ్యత, విద్య ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి వివరించాలని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కోసం అనేక చర్యలు చేపడుతుందని, అన్ని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని సాధించే దిశగా ఏకాగ్రతతో కృషి చేయాలని తెలిపారు.