calender_icon.png 9 September, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్లపల్లి డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరం

09-09-2025 01:13:10 AM

  1. మెఫీడ్రోన్ డ్రగ్ కోసం నిందితులు ముస్తఫా, ఫైజల్ హైదరాబాద్‌కు
  2. ఇక్కడి నుంచి మహారాష్ట్రకు సరఫరా
  3. గుర్తించిన మహారాష్ట్ర పోలీసులు
  4. వాగ్దేవి ల్యాబ్‌ను పరిశీలించిన తెలంగాణ అధికారులు 
  5. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది?
  6. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం
  7. 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు

మేడ్చల్, సెప్టెంబర్ 8 (విజయ క్రాంతి): చర్లపల్లిలోని వాగ్దేవి లాబరేటరీ డ్రగ్స్ కేసులో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసును మరింత లోతుగా విచారించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్టు చేయగా.. వారిని కస్టడీలోకి తీసుకుంటే మరింత సమాచారం లభిస్తుందని మహారాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు.

కాగా మెఫీడ్రోన్ డ్రగ్ కోసం నిందితులు ముస్తఫా, ఫైజల్ హైదరాబాద్ వచ్చారని, ఆ డ్రగ్‌ను మహారాష్ట్రకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్ విక్రయించడానికి ఫైజల్ మధ్యవర్తిగా వ్యవహరించాడని పేర్కొన్నారు. ముస్తఫాపై మహారాష్ట్రలో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర పోలీసులు చెపుతున్నారు. కాగా చర్లపల్లిలో వాగ్దేవి లాబరేటరీలో డ్రగ్స్ తయారీ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి రాదని తెలంగాణ జాయింట్ డైరెక్టర్ రమధాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

వాగ్దేవి కెమికల్ ఫ్యాక్టరీ మాత్రమేనని, ఔషధ తయారీ లైసెన్స్ పొందలేదని, ఫార్మా షూటికల్ కంపెనీ కూడా కాదని తెలిపారు. మెఫా డ్రోన్ అనే పదార్థం ఔషధం కాదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం మొత్తం ఎన్ డిపిఎస్ చట్టం 1985 ప్రకారం పోలీస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇతర కేంద్ర, రాష్ట్ర సంస్థల పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఈ విషయం లో డిసిఏకి ఎలాంటి చర్యలు తీసుకునే అధికారం లేదా బాధ్యత ఉండదని తెలిపారు. 

తెలంగాణ అధికారుల పరిశీలన 

చర్లపల్లి వాగ్దేవి లాబరేటరీని తెలంగాణ అధికారులు సోమవారం పరిశీలించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎక్సైజ్, నార్కోటిక్ బ్యూరో అధికారులు పరిశీలించి వివరాలు సేకరించారు. కాగా పట్టుబడిన ముడి సరుకు మొత్తం ఇదివరకే మహారాష్ట్ర పోలీసులు ఆ రాష్ట్రానికి తరలించారు.

ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోంది?: మంత్రి జూపల్లి

డ్రగ్స్ తయారీ, ముడి పదార్థాలను మహారాష్ర్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఇంతా జరుగుతున్న ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్లపల్లి డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

డా బీఆర్ అంబేద్కర్ సచివాల యంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరా వృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, మాదకద్రవ్యాల నియంత్రణకు కార్యచరణ ను రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.