calender_icon.png 9 September, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరకయాతన

09-09-2025 01:13:54 AM

ఒక్క బస్తా యూరియా కోసం తల్లడిల్లుతున్న రైతన్న

పలు జిల్లాల్లో రాస్తారోకోలు.. స్తంభించిన ట్రాఫిక్

అంతులేని తండ్లాట

  1. విక్రయ కేంద్రాల వద్ద భారీ క్యూలు 
  2. పలుచోట్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, సెప్టెంబర్ 8: యూరియా కోసం రైతుల కు తండ్లాట తప్పడం లేదు. రెండు నెలలుగా రోజూ నరకయాతన అనుభవిస్తు న్నారు. విక్రయ కేంద్రాల వద్ద భారీగా క్యూ కడుతున్నా ఒక్క బస్తా యూరియా కూడా దొరకడం లేదు. పంట పెట్టుబడికి పెట్టిన సాయం కూడా దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం యూరియా అందు బాటులోకి తీసుకొచ్చామని చెపుతున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో రైతులకు కావా ల్సినంత యూరియా లభించడం లేదు. విక్రయకేంద్రాలకు వస్తున్న యూరియా బస్తాలకు, క్యూలో నిల్చున్న రైతుల సంఖ్యకు సరిపోకపోవడంతో ఆందోళన బాటపడుతున్నారు.

సోమవారం కూడా రైతులకు యూరియా దొరకకపోవడంతో రాష్ట్రంలోని పలు జిల్లా లో రాస్తారోకోలు చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

ఉమ్మడి మెదక్‌లో ఆందోళనలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో సోమవా రం వందలాది సంఖ్యలో రైతులు బారులు తీరారు. దాదాపు 600 మందికి పైగా రైతులు యూరియా టోకెన్ల కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లైన్లో నిలబడ్డారు. 980 బస్తా ల యూరియాను అధికారులు వివిధ దుకాణాల ద్వారా పంపిణీ చేయగా, ఉదయం నుంచి క్యూలో నిలబడ్డ వందమందికి పైగా రైతులకు దొరకలేదు. దీంతో రైతులంతా గజ్వేల్‌లోని తూప్రాన్ రహదారి రాస్తారోకో నిర్వహించారు.

పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులకు నచ్చజెప్పి బుజ్జగించారు. అప్పటికే 100కు పైగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్న పేట మండల కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

తెలంగాణ రాష్ర్ట అభివృద్ధిని కేంద్రం ఓ్ంవలేకనే యూరియా సరఫరాలో జాప్యం చేస్తోందని మండిపడ్డారు. నంగునూరు మండల కేంద్రంలోని మన గ్రోమార్ వద్ద రైతులు భారీ క్యూ కట్టారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని నటరాజ్ ట్రేడర్స్ వద్ద సోమవారం రైతులు భారీగా బారులు తీరి యూరి యా కోసం ఎగబడ్డారు. కొందరికే టోకెన్లు అందడంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. చేగుంట మండల కేంద్రంతో పాటు మాసాయిపేట జాతీయ రహదారి రైతులు రాస్తారోకో చేపట్టారు.

దీంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. చేగుంట కేంద్రంలో గత రెండు రోజులుగా పడిగాపులు కాస్తున్నా,  కొంతమంది నాయకులు ఫర్టిలైజర్ షాపుల యజమానులతో కుమ్మక్కై  యూరియా బస్తాలను పక్కదారి పట్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కేంద్రం వద్ద చెప్పులు, కొమ్మల్లు లైన్‌లో పెట్టారు.

పీఏసీఎస్‌ల వద్ద ఉద్రిక్తత

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని సహకార సంఘం వద్ద సోమవారం రెండు వందల మంది రైతులు పడిగాపులు కాశారు. యూరియా వచ్చి కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల అందడంలేదని మండిపడ్డారు. నల్లగొండ జిల్లా హాలియా మండల కేంద్రంలోని కొత్తపల్లి సహకారం కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం నుంచే  భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఆధార్ కార్డులు  చేత పట్టుకొని తమ వంతు కోసం గంటలకొద్దీ నిరీక్షించారు.

ఉదయం నుంచి 10 గ్రామాల రైతు లు పెద్ద సంఖ్యలో రైతులు రావడంతో మధ్యాహ్నం  ఒంటి గంట కే యూరియా అయిపోయిందని అధికారులు  చేతులెత్తేశా రు. దీంతో ఆగ్రహించిన రైతులు సాగర్ రోడ్‌పై రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ జామ్ భారీగా కావడంతో సంఘటనా స్థలానికి హాలియా ఎస్‌ఐ సాయి ప్రశాంత్ చేరు కొని రైతులను శాంతింపజేశారు.

నిర్మల్ జిల్లాలో రైతులకు ఎరువుల కొడత లేకుండా చర్యలు  తీసుకోవాలని అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిం చారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ పరపతి సంఘం వద్ద రైతులు చెప్పులు వరుసల్లో పెట్టి వెళ్లారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో

హనుమకొండ జిల్లాలోని కమలాపూర్, దామెర, ఆత్మకూర్, పరకాల, ధర్మసాగర్, నడికూడ, వేలేరు, ఎలుకతుర్తి, భీమదేవరపల్లి తదితర మండలాల్లో యూరియ కొరత నెలకింది. కమలాపూర్ మండలంలోని మరిపెల్లి గూడెం ప్రాథమిక సహకార కేంద్రం కార్యాలయంలో గత రెండు రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. 

ప్రైవేట్ వ్యాపారుల చేతివాటం?

యూరియా కొరతను ప్రైవేటు ఎరువుల డీలర్లు కొందరు తమకు అనుకూలంగా మలచుకొని, అధిక ధరలకు రాత్రిపూట గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఇదే తరహాలో ఇటీవల ఓ షాపు యజమాని తనకు వచ్చిన యూరియాను రాత్రికి రాత్రే విక్రయించుకోగా అధికారులు ఆ షాపు యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.

ఇటీవల కూడా ఇదే తరహాలో మరో షాపు యజమాని తనకు వచ్చిన 200 పైగా యూరియా బస్తాలను తనకు అనుకూలమైన వారికి బస్తాకు 50 రూపాయలు అధికంగా తీసుకొని ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఓ ఎరువుల విక్రయ కేంద్రం నుంచి అధికారులకు సమాచారం ఇవ్వకుండా యూరియా బస్తాలను విక్రయిస్తుండగా కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో యూరియా విక్రయిస్తున్నట్లు గుర్తించి, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

అదనంగా 16 విక్రయ కేంద్రాలు 

రైతులకు ఎరువుల విక్రయాల్లో రద్దీ తగ్గించి సౌకర్యవంతమైన విధంగా పంపిణీ చేయడానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అదనంగా 16 ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో వ్యవసాయ శాఖ, సహకార శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనంగా ఏర్పాటు చేయనున్న 16 ఎరువుల విక్రయ కేంద్రాలకు ఈ-పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. 

అధికారులంతా యూరియా పంపిణీలోనే! 

జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో యూరియా సంక్షోభం అధికారులకు తలపోటుగా మారింది. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్ కుమార్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్, డీఎస్పీ తిరుపతిరావుతో పాటు జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులను కూడా యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నెత్తికెత్తుకున్నారు.

జిల్లావ్యాప్తంగా 18 మండలాలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించిన కలెక్టర్, సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా రద్దుచేసి పూర్తిగా యూరియా పంపిణీ పైనే దృష్టి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా మండలాల్లో కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, డీఎస్పీలు, సీఐలు, వ్యవసాయ, సహకార, హార్టికల్చర్, ఇతర శాఖల అధికారులు తమకు కేటాయించిన మండలాల్లో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.

రెండు రోజుల నుండి స్వయంగా కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు సోమవారం కలియతిరిగారు. ఎక్కడ కూపన్లు ఇచ్చారు, సోమవారం ఎంత యూరియా పంపిణీ జరిగింది, మంగళవారం ఇంకా ఎంతమందికి యూరియా ఇప్పించాల్సి ఉంది అనే విషయంపై నివేదిక రూపొందించి మంగళవారం యూరియా పంపిణీ కోసం ప్రభుత్వానికి సమాచారం అందజేసి ఆ మేరకు జిల్లాకు యూరియా కోట తెప్పించేందుకు చర్యలు చేపట్టారు.