3 April, 2026 | 2:44 AM

మదర్ డెయిరీ నష్టాలపై విచారణ

03-04-2026 12:42 AM
  1. పదేండ్ల లెక్కలపై డీసీవో ఆధ్వర్యంలో విచారణ కమిటీ 

మదర్ డెయిరీ చైర్మన్  గుడిపాటి మధుసూదన్‌రెడ్డి 

ఎల్బీనగర్, ఏప్రిల్ 2 : మదర్ డెయిరీని నష్టాల నుంచి కాపాడడానికి, రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వ సహకారంతో ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకున్నామని మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. దీంతోపాటు మదర్ డెయిరీలో పదేండ్ల పాటు జరిగిన లావాదేవీలపై డీసీవో ఆధ్వర్యంలో విచారణ కమిటీ నియమించినట్లు చెప్పారు. హయత్‌నగర్‌లోని సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పదేండ్లుగా నార్ముల్ (మదర్ డెయిరీ) సంస్థ నష్టాలను చవి చూస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంస్థ నష్టాల్లోకి వచ్చిందన్నట్లుగా వస్తున్న వార్తలు సరికాదన్నారు. లింగయ్య అనే మాజీ సొసైటీ అధ్యక్షుడి పేరున ఆర్సీఎస్, ఏసీబీ, విజిలెన్స్ విభాగాలకు వెళ్లిన ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం దశాబ్ద కాలంగా సంస్థ నష్టాలకు కారణాలపై విచారణ కొనసాగిస్తుందని చెప్పారు.

ఈ క్రమంలో స్టేట్ కో-ఆపరేటివ్ విభాగం రంగారెడ్డి డీసీవో ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. విచారణలో భాగంగా మాజీ చైర్మన్లు, ఎండీలు, ప్రస్తుత పాలక వర్గo మొత్తం 42 మందికి నోటీసులు జారీ చేశారన్నారు. విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయితే పూర్తి వివరాలు బహిర్గతం అవుతాయన్నారు. సంస్థలో అవినీతి అక్రమాలను సహించేది లేదని, ఇప్పటికే ఎండీ కృష్ణతోపాటు మరికొదరిని సస్పెండ్ చేసామని గుర్తు చేశారు.

భువనగిరి పాలకేంద్రంలో అక్రమాలపై విచారణ జరిపామని ఇప్పటికే మేనేజరు, ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశామన్నారు. అక్రమ సొమ్మును రికవరీ చేస్తామని, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. సమావేశంలో ఎండీ కాటిపల్లి లింగారెడ్డి, ఏవో అబ్దుల్ గఫార్ పాల్గొన్నారు.