calender_icon.png 3 January, 2026 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్లుపెరిగిన ఇన్వెస్టర్ల సంపద

25-04-2024 01:40:54 AM

ముంబై, ఏప్రిల్ 24: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో బుధవారం సైతం స్టాక్ మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగింది. మార్కెట్ పెరగడం ఇది వరుసగా నాల్గవ రోజు. బుధవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు పెరిగి 73,852 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ 4 రోజుల్లో సెన్సెక్స్ 1,364 పాయింట్లు లాభపడగా, ఇన్వెస్టర్ల సంపద రూ.8.48 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ నాలుగు రోజుల్లో రూ.8,48,328.9 కోట్లు పెరిగి రూ.4,01,37,377.21 కోట్లకు చేరింది. ఇతర ఆసియా మార్కెట్లతో పోలిస్తే భారత్ సూచీలు వెనుకపడ్డాయని, ఐటీ, ఇతర హెవీవెయిట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపర్చడం ఇందుకు కారణమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్  వినోద్ నాయర్ చెప్పారు. ఆసియాలో టోక్యో ఇండెక్స్ భారీగా 3 శాతం పెరిగింది. టోక్యో, షాంఘై, హాంకాంగ్‌లు సైతం లాభాలతో ముగిసాయి. 

గరిష్ఠస్థాయిలో లాభాల స్వీకరణ

బుధవారం సెన్సెక్స్ ఇంట్రాడేలో 383 పాయింట్లు పెరిగి 74,122 పాయింట్ల వద్ద కు చేరగా, ఆ గరిష్ఠస్థాయి వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. టెలికం, ఐటీ, టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి కారణం గా సూచీల లాభాలు పరిమితంగా ఉన్నాయన్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం ఇంట్రాడే లో 22,500 పాయింట్లను సమీపించినప్పటికీ, ముగింపు సమయంలో జరిగిన అమ్మ కాలతో సూచీ 34 పాయింట్ల మేర లాభపడి 22,402 పాయింట్ల వద్ద నిలిచింది. 

షార్ట్ కవరింగ్ ప్రభావం

ప్రపంచ సానుకూల సంకేతాల నేపథ్యంలో గురువారం డెరివేటివ్ కాంట్రాక్టులకు ముగింపు రోజైనందున ఇన్వెస్టర్లు వారి షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకోవడంతో మార్కెట్ మరింత పెరిగిందని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల పట్ల అనిశ్చితి నెలకొన్నదని, వివాదం ముదిరితే క్రూడ్ ధరలు పెరుగుతాయన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయని వివరించారు. 

కొనసాగిన ఎఫ్‌పీఐల అమ్మకాలు

డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అధికస్థాయిలో ఉండటంతో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ సోమ, మంగళవారాల్లో రూ.5,000 కోట్ల వరకూ నికర విక్రయాలు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) బుధవారం మరో రూ.2,500 కోట్లు వెనక్కు తీసుకున్నట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

స్టీల్ షేర్ల జోరు

సెన్సెక్స్ బాస్కెట్‌లో తాజాగా స్టీల్ షేర్లు జోరు చూపించాయి. టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు 3 శాతంపైగా పెరిగాయి. పవర్‌గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్‌లు 1 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు టీసీఎస్, టెక్ మహీంద్రా, మారుతి, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్ 1 శాతం వరకూ నష్ట పోయాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా మెటల్స్ సూచి 2.83 శాతం పెరిగింది. కమోడిటీస్ ఇండెక్స్ 1.62 శాతం, ఇండస్ట్రియ ల్స్ ఇండెక్స్ 1.13 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.96 శాతం చొప్పున పెరిగాయి. ఐటీ, టెలికాం సూచీలు  నష్టపోయాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.79 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.92 శాతం చొప్పున పెరిగాయి.