calender_icon.png 3 January, 2026 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటక్ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్

25-04-2024 01:44:14 AM

కొత్త క్రెడిట్ కార్డుల జారీకి బ్రేక్

ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ద్వారా కొత్త కస్టమర్లకు నో

ఆదేశాలు తక్షణం అమల్లోకి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రిజర్వ్‌బ్యాంక్ షాకిచ్చింది. కొత్త క్రెడిట్ కార్డులు జారీచేయరాదని, ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లకు చేర్చుకోకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో కొన్ని విభాగాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు గుర్తించినందున ఈ నియంత్రణలు విధిస్తున్నట్టు ఆర్బీఐ బుధవారం  నాడు ప్రకటించింది. ఖాతాదారుల ప్రయోజనాల కోసం జారీచేసిన తమ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది. బ్యాంక్ రిస్క్ మేనేజ్‌మెంట్, నిబంధనల పాటింపుపై ఆందోళన తలెత్తినందున ఈ చర్యలు తీసుకున్నట్టు వివరించింది. ఆర్బీఐ ముందస్తు అనుమతితో కోటక్ బ్యాంక్ ఒక సమగ్ర థర్డ్ పార్టీ ఆడిట్ పూర్తి చేసిన తర్వాత బ్యాంక్‌పై విధించిన నియంత్రణల్ని కేంద్ర బ్యాంక్ తిరిగి సమీక్షిస్తుంది. ఈ మేరకు ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. 

ప్రస్తుత ఖాతాదారులకు యథావిధిగా సేవలు..

కోటక్ మహీంద్రా బ్యాంక్ తన క్రెడిట్ కార్డు వినియోగదారులతో సహా ప్రస్తుత ఖాతాదారులకు యథావిధిగా బ్యాంకింగ్ సేవలు కొనసాగించవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ తాజా ఆదేశాల్లో ప్రస్తుత ఖాతాదారులకు సేవలందించడంపై ఎటువంటి నియంత్రణలు విధించనందున, మీరు ఇప్పుడు కోటక్ బ్యాంక్ కస్టమర్ అయినట్టయితే మీకు బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయి.

ఐటీ సిస్టమ్స్‌ను పటిష్టపరుస్తాం :బ్యాంక్ వివరణ

వ్యాపార నియంత్రణల్ని విధిస్తూ రిజర్వ్‌బ్యాంక్ ప్రకటనచేసిన తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ స్పందిస్తూ తమ ఐటీ సిస్టమ్స్‌ను పటిష్టపర్చేందుకు చర్యలు తీసుకున్నామని, సమస్యలు పరిష్కరించేందుకు ఆర్బీఐతో కలసి పనిచేస్తామని తెలిపింది. ‘ఐటీ సిస్టమ్స్‌ను పటిష్టం చేసేందుకు కొత్త టెక్నాలజీలను అవలంబిస్తాం, మిగిలిన సమస్యలు త్వరితంగా పరిష్కరించుకునే రీతిలో రెగ్యులేటర్‌తో కలిసి పనిచేస్తాం’ అంటూ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక  ప్రకటన విడుదల చేసింది. ఆర్బీఐ నియంత్రణల కారణంగా ప్రస్తుత కస్టమర్లకు అందిస్తున్న సర్వీసులపై ఎటువంటి ప్రభావం ఉండదని బ్యాంక్ తెలిపింది. ‘మా ప్రస్తుత ఖాతాదారులకు క్రెడిట్ కార్డ్, మొబైల్, నెట్ బ్యాంకింగ్‌లతో సహా నిరంతర సేవలు అందుతాయని హామీ ఇస్తున్నాం. మా శాఖలు కొత్త కస్టమర్లను ఆహ్వానిస్తాయి. వారికి బ్యాంక్ సేవలన్నింటినీ అందిస్తాయి’ అని బ్యాంక్ వివరించింది. 

కొన్ని విభాగాల్లో లోటుపాట్లు..

వరుసగా 2022, 2023 సంవత్సరాల్లో తమ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో ‘గణనీయమైన’ ఆందోళనల్ని పసిగట్టామని, ఈ ఆందోళనలకు సమయానుగుణ, సమగ్రమైన వివరణలివ్వడంలో బ్యాంక్ విఫలంకావడంతో తాజా చర్యలు తీసుకున్నట్టు రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. ఐటీ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, ప్యాచ్ అండ్ ఛేంజ్ మేనేజ్‌మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్‌మెంట్, వెండార్ రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా సెక్యూరిటీ, డేటా లీక్ ప్రివెన్షన్ స్ట్రాటజీ, డిజాస్టర్ రికవరీ డ్రిల్ తదితర విభాగాల్లో తీవ్ర లోటుపాట్లు కన్పించాయని, నిబంధనల ఉల్లంఘన జరిగిందని బ్యాంకింగ్ రెగ్యులేటర్ తెలిపింది. ఈ నేపథ్యంలో కొత్త క్రెడిట్ కార్డులు జారీచేయడం, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడం నిలిపివేయాలంటూ కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను ఆదేశించినట్టు వివరించింది. 

ఏప్రిల్ 15న ఏం జరిగింది?

ఆ రోజున పలువురు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాదారులు బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించుకోలేకపోయారు. మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను లాగిన్ చేసుకోలేక వారి అసంతృప్తిని సోషల్ మీడియా పోస్టుల్లో వెల్లడించారు. మరికొంతమంది కస్టమర్లు నెట్‌బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్‌కార్డు లావాదేవీలు సక్రమంగా జరగలేదంటూ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులకు కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్ కేర్ హ్యాండిల్‌లో ఒక బ్యాంక్ అధికారి సమాధానమిస్తూ టెక్నికల్ సర్వర్లు నెమ్మదించాయని, సమస్యల్ని పరిష్కరించి, సర్వీసులను త్వరితంగా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.