ఏఐ ‘న్యాయ’మేనా?
కృత్రిమమేధ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తున్నది. సమాచార సేకరణ, విశ్లేషణ వంటి పనులను క్షణాల్లో పూర్తిచేయగల సామర్థ్యంతో ఇది విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్నది. అయితే, రెండువైపులా పదునున్న కత్తి లాంటి దీన్ని సరిగ్గా వినియోగించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని దేశ అత్యున్నత న్యాయ స్థానం సాక్షిగా మరోసారి స్పష్టమైంది. సుప్రీంకోర్టులో జమ్మూకశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్‌కు సంబంధించి ఓ ప్రైవేట్ సంస్థ దివాలా కేసు విచారణ సందర్భంగా దాఖలైన అఫిడవిట్‌లో ఏఐ సాయంతో సృష్టించిన కల్పిత తీర్పులను ప్రస్తావించడం ఆందోళన కలిగించింది.
అందులో పేర్కొన్న పలు తీర్పులు అవాస్తమని గుర్తించిన సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానిజాలను నిర్ధారించకుండా ఏఐ ఇచ్చిన సమాచారాన్ని న్యాయస్థానాల ముందుంచడం అత్యంత ప్రమాదకరమని ఈ సందర్భంగా హెచ్చరించడం గమనార్హం. అయితే, ఏది నిజమో, ఏది కృత్రిమమేధ సమాచారమో గుర్తించడం కష్టసాధ్యమైన ప్రస్తుత తరుణంలో ఈ అంశంపై అధ్యయనం చేసి, మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్‌కు సూచించడం ముదావడం. వాస్తవానికి ఏఐని సరిగ్గా వినియోగిస్తే అది న్యాయవ్యవస్థకు ఎంతో ఉపయోగకరమైన సాధనంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
గత తీర్పుల విశ్లేషణలు, చట్టాలపై అధ్యయనాలు, కేసులకు సంబంధించిన సమాచారంపై పరిశోధనలు వంటి పనులను ఏఐ చాలా తక్కువ సమయంలో పూర్తిచేయగలదన్న విషయం తెలిసిందే. దీనివల్ల న్యాయమూర్తులు, న్యాయవాదుల అమూల్యమైన సమయం ఆదా అవుతుంది. అదే సమయంలో న్యాయస్థానాల నిర్వహణ మరింత సమర్థంగా సాగుతుంది. అంతేకాదు, కేసుల విచా రణ కూడా వేగవంతమై ఫైళ్లకు పట్టిన బూజు వదులుతుంది.
అయితే కొన్ని సందర్భాల్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చి న్యాయ ప్రక్రియను ఏఐ తప్పుదోవపట్టించే ప్రమాదమూ లేకపోలేదు. భవిష్యత్తులో న్యాయవ్యవస్థపై ఏఐ ప్రభావం మరింత పెరిగే ఆస్కారం ఉంది. వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక విప్లవాన్ని పూర్తిగా అడ్డుకోవడం, న్యాయస్థానాల్లోకి కృత్రిమమేధ చొరబడకుండా ఆపడం అసాధ్యమనే చెప్పాలి. అదే సమయంలో దాన్ని గుడ్డిగా నమ్మడమూ అత్యంత ప్రమాదకరం. ఈ నేపథ్యంలో ఏఐ సాంకేతికతను మానవ విచక్షణ ఆధారంగా వినియోగించాలని చెప్పక తప్పదు. అప్పుడే విశ్వసనీయత, పారదర్శకతతో న్యాయవ్యవస్థ పరిఢవిల్లుతుంది.






