ఓటుపై సీమాంధ్రుల మీమాంస
హైదరాబాద్‌లో నివసిస్తూ రెండు రాష్ట్రాల్లో ఓటేస్తున్న సీమాంధ్రులకు ‘సర్’ మిలియన్ డాలర్ల ప్రశ్న వేస్తున్నది. ఈ గట్టునే ఉంటారా, ఆ గట్టుకు వెళ్తారా? అన్నది తేల్చుకోవాలని చెబుతున్నది. రాష్ట్ర విభజన జరిగి పన్నెండే ళ్లు గడిచాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో దశాబ్దాలుగా స్థిరపడిన సీమాంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తమ ఓటుహక్కును ఎక్కడ వినియోగించబోతున్నారు? అన్న ప్రశ్న ఉదయిస్తున్నది.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ అందరికీ ఉమ్మడి రాజధాని. ఉద్యోగం, వ్యాపారం, విద్య, వైద్యం, సినిమా, పరిశ్రమ లు, ప్రతి రంగంలోనూ రెండు ప్రాంతాల ప్రజలు కలిసి జీవించారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సరిహద్దులు మారినా, సామాజిక సంబంధాలు మాత్రం ఒక్కరోజులో తెగిపోలేదు. నేటికీ లక్షలాది మంది సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. వారి పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. వ్యాపారాలు ఇక్కడే సాగుతున్నాయి.
పన్నులు తెలంగాణకే చెల్లిస్తున్నారు. మరోవైపు కొందరు ప్రముఖులు తెలంగాణలో ఉంటున్నా ఏపీలో రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటున్నారు. ముఖ్యంగా అలాంటివారు ఇప్పుడు ఎక్కడ ఓటుహక్కును కొనసాగిస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా నివసించే ప్రాంతంలోనే ఓటరుగా నమోదు కావాలన్నది భారత ఎన్నికల చట్టంలోని నిబంధన. అంటే జీవితమంతా హైదరాబాద్‌లోనే సాగుతుంటే, ఇక్కడే ఓటు వేయడం ప్రజాస్వామ్యపరంగా సరైన నిర్ణయమే.
ఎందుకంటే నగర రహదారులు, ట్రాఫిక్, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, ఆసుపత్రులు, శాంతిభద్రతలు, పట్టణ ప్రణాళిక వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో వారికి ప్రత్యక్ష ప్రయోజ నం ఉంటుంది. అయితే మరోవైపు భిన్నమైన రాజకీయ వాస్తవం కూడా ఉంది. చాలామంది కుటుంబ మూలాలు ఇప్పటికీ ఏపీలోనే ఉన్నాయి. వ్యవసాయ భూములు, వ్యాపారాలు, రాజకీయ ప్రస్థానం అక్కడే కొనసాగుతోంది.
భవిష్యత్తులో ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా కొందరికి ఉండవచ్చు. అలాంటి వారు స్వస్థలంలోనే ఓటును కొనసాగించడం సమంజసమే. ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది. హైదరాబాద్‌లో నివసిస్తూ ఏపీలో ఓటు కొనసాగిస్తే, తెలంగాణలో నివసిస్తున్న ప్రజల సమస్యల పట్ల పూర్తి బాధ్యత తీసుకుంటున్నారా? అనే ప్రశ్న వస్తుంది. అలాగే హైదరాబాద్‌లో ఓటు మార్చుకుంటే, తమ స్వస్థల ప్రజలతో అనుబంధాన్ని వదిలేశారా? అనే విమర్శ ఎదురవుతుంది.
ఈ రెండు ప్రశ్నలూ రాజకీయంగా సున్నితమైనవే. ఈ నేపథ్యంలో సీమాంధ్ర నాయకుల ఓటు నిర్ణయం కూడా కొత్త రాజకీయ సంస్కృతికి ప్రతీకగా ఉండాలి. తెలంగాణలో స్థిరపడినవారు ఇక్కడి ప్రజల తో మమేకమైతే, వారి ఓటు కూడా ఇక్కడే ఉండడం సహజమైన పరిణామంగా చూడాలి. అదే సమయంలో స్వస్థల ప్రజలతో రాజకీయ సంబంధా లు కొనసాగించాలనుకునేవారి నిర్ణయాన్ని కూడా ప్రజాస్వామ్య దృష్టితో గౌరవించాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం పౌరుడికి నివాస స్వేచ్ఛను, ఓటుహక్కును చట్టబద్ధంగా కల్పించింది. కానీ, ప్రజాస్వామ్యంలో చట్టబద్ధత ఒక్కటే సరిపోదు.
ప్రజల దృష్టిలో నైతికత కూడా అంతే ముఖ్యం. ఒక నాయకుడు ఎక్కడ నివసిస్తున్నాడు? ఎక్కడి ప్రజలతో మమేకమవుతున్నాడు? ఎక్కడి సమస్యలపై స్పందిస్తున్నాడు? అనే అంశాలే చివరికి అతని రాజకీయ విశ్వసనీయతను నిర్ణయిస్తాయి. ప్రజాస్వామ్యంలో ఓటు ఒక హక్కు మాత్రమే కాదు; అదొక బాధ్యత. ఆ బాధ్యత ఎక్కడ నిర్వర్తించాలన్నది ప్రతి పౌరుడి వ్యక్తిగత నిర్ణయం. కానీ ప్రజాజీవితంలో ఉన్నవారి విషయంలో ఆ నిర్ణయం రాజకీయ సందేశంగా మారుతుంది.
అందుకే హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్ర నాయకుల ఓటు ఎక్కడ అన్న ప్రశ్నకు సమాధానం కోసం ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అయితే, చివరికి నాయకుడు ఎక్కడ ఓటు వేశాడన్న దానికంటే, ఎక్కడి ప్రజలతో నిలబడ్డాడన్నదే చరిత్ర గుర్తుంచుకుంటుంది. తెలంగాణలో ఉంటూ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంటే ఆ ఓటుకు విలువ ఉంటుంది. స్వస్థలంలో ఉంటూ అక్కడి ప్రజల అభ్యున్నతికి కృషి చేసినా అదే గౌరవం దక్కుతుంది. కానీ, ఒకచోట నివసిస్తూ మరోచోట రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఓటును వినియోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచింది కాదు.
బత్తుల సత్యనారాయణ
వ్యాసకర్త: జర్నలిస్ట్, 9963991120






