అల్ల నేరేడు పండ్లు ఎక్కువగా కాస్తే కరువుకు సంకేతమా?
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం...
- వదంతులకు ఉత్తమిస్తున్న వర్షాభావ పరిస్థితులు...
ఆదిలాబాద్, జూలై 2 (విజయక్రాంతి) : ప్రస్తుతం మార్కెట్ లో ఎటు చూసినా అల్ల నేరేడు పండ్లే కనిపిస్తున్నాయి. గతంలో కంటె ఈసారి ఎక్కువగా ఈ పండ్లు కాయడంతో మార్కెట్లో పుష్కలంగా లభిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కిలో అల్ల నేరేడు పండ్లు రూ. 150 నుండి 200 రూపాయలు ధర పలుకుతున్నాయి. అయితే ఈయేడు పుష్కలంగా లభిస్తున్న అల్ల నేరేడు పండ్లు భవిష్యత్తు విపత్తును హెచ్చరిస్తున్నాయనే వాదన ప్రచారంలో ఉంది.
ఈ విషయం సామాజిక మాధ్యమాలలో మెసేజ్ ల రూపంలో చెక్కర్లు కొడుతోంది. కొందరు ఈ వాదనను కొట్టిపారయలేమంటూనే శాస్త్రీయంగా ఇది నిరూపితం కూడా కాలేదని అంటున్నారు. ఇంతకి ఈ అల్లనేరేడు పండ్లు ఎందుకు అధికంగా కాశాయి, అది దేనికి సంకేతం, అసలు ఈ పరిస్థితులను ఎలా అర్ధం చేసుకోవాలి.ప్రసుత సీజన్ లో పుష్కలంగా లభించే పండ్లు అల్ల నేరేడు పండ్లు. సాధారణంగా జూన్, జూలై నెలల్లో ఎక్కువగా లభించే ఈ పండ్లు ఈ యేడు ఏప్రిల్, మే మాసాల నుండే మార్కెట్ లోకి వచ్చాయి.
ఆకుపచ్చ చెట్ల మధ్య నల్లగా నిగనిగలాడుతూ కనిపించే ఈ పండ్లు తింటే శరీరాని శక్తిని అందించి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండ్లలో ఎన్నో పోషకాలు గుణాలు ఉన్నాయి. పండ్లే కాదు ఈ చెట్టు ఆకులు, బెరడు కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రుచికరమైన ఈ పండ్లు ఎన్నో ఔషద గుణాలను కూడా కలిగి ఉంటాయి.ఈ సంవత్సరం గతంలో ఎప్పుడు చూడనంతగా ఈ అల్ల నేరేడు పండ్లు మార్కెట్ లో కనిపించడం చర్చనీయాంశమైంది.
గతంలో కాయని చెట్లకు కూడా ఈ యేడు పుష్కలంగా పండ్లు కాస్తున్నాయి. ఇది యాదృచ్చికంగా జరిగినదేనా లేక ప్రకృతి మనకు ఏదైనా సంకేతమిస్తున్నదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేసవిలో ఎక్కువగా నేరేడు పండ్లు కాస్తే, ఆ సంవత్సరం కరువు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కొందరు పెద్దలు పేర్కొంటున్నారు. వేసవిలో నేరేడు చెట్లు అసాధారణంగా ఎక్కువ కాసి, పండ్లు రాలితే అది రాబోయే ఎండలు లేదా నీటి కొరతకు ప్రకృతి ఇచ్చే సూచనగా భావించవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఎన్ లినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం ఈ వాదనకు బలాన్నిస్తోంది.
ఈ యేడు ఎన్ లినో ప్రభావంగా వర్ష పాతం తగ్గవచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు తగ్గడం, ఉష్ణోగ్రతల పెరుగుదల, ఇతర వాతావరణ ఒత్తిడిలు ఎదురైప్పుడు చెట్టు తన జీవన చక్రంలో మార్పులు చేస్తుందని, అలాంటి సమయంలో చెట్టు కొమ్ములు, ఆకులు, పండ్లు, విత్తనాల ఉత్పత్తిపై ఎక్కువ శక్తిని ఖర్చుచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అల్ల నేరేడు చెట్లు ఒత్తిడికి గురి అయినా, లేక వాతావరణ పరిస్థితుల కారణంగా ఎక్కువగా పండ్లు కాసే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ పండ్లు కాస్తే కరువు వస్తుందని చెప్పలేమని, కానీ ప్రస్తుత పరిస్థితులు కూడా అందుకు తగ్గట్లుగా ఉండటం ఈ అభిప్రాయనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది.
- డా. మల్లేష్,ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, ఆదిలాబాద్.






