12-07-2025 12:00:00 AM
చెన్నై, జూలై 11: ‘ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌కు నష్టం జరిగిందా? ఏమైనా ఆధారాలున్నాయా? భారత్ నష్టపోయినట్టు ఒక్క ఫొటో కూడా లేదు. విదేశీ మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోంది.’ అని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేర్కొన్నారు. గురువారం ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవ వేడుకలో దోవల్ ఈ వ్యా ఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్‌లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని నిర్ణయించు కున్నాం.
ఆ స్థావరాలు అన్నీ సరిహద్దుల్లోనే లేవు. ఆ తొమ్మిదింటిలో ఒక్క లక్ష్యం కూడా మేము గురి తప్పలేదు. కేవలం 23 నిమిషాల్లోనే పూర్తి ఆపరేషన్ ముగిసింది. ఉదయం 1.21కి ప్రారంభమైన ఆపరేషన్ 1.28కి ముగిసింది. ఆ తర్వాత విదేశీ మీడియా ఎన్నో విషయాలు ప్రచారం చేసింది. భారత్‌కు నష్టం జరిగినట్టు ఒక్క ఫొటోకానీ ఆధారం కానీ ఉందా.? ఆపరేషన్ సిందూర్‌లో స్వదేశీ పరిజ్ఞానాన్నే ఎక్కువగా ఉపయోగించాం.
ఆపరేషన్ విజయవంతంగా ముగించినందుకు నిజంగా మేం గర్వంగా ఉన్నాం. చైనా వాళ్లు 12 సంవత్సరాలు శ్రమించి దాదాపు 300 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి 5జీని అభివృద్ధి చేశారు. కానీ మనం తక్కువ ఖర్చుతోనే 5జీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొ చ్చాం. కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే భారత్‌లో 5జీని డెవలప్ చేశాం.’ అన్నారు.