calender_icon.png 13 July, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

49 వేల కోట్ల కుంభ కోణం

12-07-2025 12:00:00 AM

  1. పెరల్ ఆగ్రో టెక్ మాజీ డైరెక్టర్ గుర్నామ్ సింగ్ అరెస్ట్
  2. లాభాల ఆశ చూపి పెట్టుబడిదారుల నుంచి వేల కోట్లు వసూలు
  3. డిపాజిట్లు తిరిగి ఇవ్వకపోవడంతో స్కామ్ వెలుగులోకి
  4. సంస్థ పేరు మార్చి ఏపీ సహా పది రాష్ట్రాల్లో కార్యకలాపాలు

న్యూఢిల్లీ, జూలై 11: పెట్టుబడిదారుల నుంచి వేల కోట్లు మోసం చేసిన కేసులో పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ (పీఏసీఎల్) మాజీ డైరెక్టర్ గుర్నామ్ సింగ్ (69)ను యూపీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 10 రాష్ట్రాల్లో రూ. 49 వేల కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. గుర్వంత్ ఆగ్రోటెక్ లిమిటెడ్‌ను గుర్నామ్ సింగ్ 2011లో పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్‌గా మార్చారు.

తదుపరి దశల్లో సంస్థను పది రాష్ట్రాలకు విస్తరించి కార్యకలాపాలు నిర్వహించారు. ఆర్బీఐ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే బ్యాంకింగ్ సేవలు కొనసాగించారు. తమ కంపెనీలో డిపాజిట్లు చేస్తే మంచి లాభాలతో పాటు రిటర్నులతో పాటు భూములు ఇస్తామని ఆశ చూపించి ప్రజలతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించారు. ఇలా ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రూ.49 వేల కోట్లు డిపాజిట్లుగా స్వీకరించారు.

అయితే వాస్తవంగా ఆ డబ్బుకు ఎటూ గమ్యం లేకుండా పోయింది. భూములు ఇవ్వకపోవడం, డిపాజిట్లను తిరిగి చెల్లించకపోవడం వల్ల భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును యూపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగానికి అప్పగించింది. ఈ కేసుకు సంబంధించి 10 మంది నిందితుల్లో ఒకరైన గుర్నామ్ సింగ్‌ను తాజాగా అరెస్ట్ చేశారు. కాగా 2012-2015 మధ్య గుర్నామ్ సింగ్‌పై ఢిల్లీలో కేసులు నమోదు కాగా.. 2016లో సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది.

ఆరు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన గుర్నామ్ తొమ్మిదేళ్ల పాటు రహస్య జీవితాన్ని గడిపారు. తాజాగా పీఏసీఎల్ కుంభకోణంలో పది రాష్ట్రాల ప్రజలు మోసపోవడంతో దేశంలోనే అతిపెద్ద మోసాల్లో ఒకటిగా నిలవనుంది. ఈ మల్టీ స్కామ్ కేసులో నలుగురు నిందితులు ఇప్పటికే జైలులో ఉన్నారు. గుర్నామ్ అరెస్టుతో కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.