‘మద్దతు’ అంతేనా?
- నాణ్యత పేరుతో దిగుమతికి నిరాకరిస్తున్న అధికారులు
- తక్కువ ధరకే వ్యాపారులకు విక్రయిస్తున్న రైతులు
కల్వకుర్తి, డిసెంబర్ 15: అకాల వర్షాలు, ప్రభుత్వ నిబంధనలు పత్తి, పాలిట శాపంగా మారింది. విత్తనం విత్తిన నాటి నుండి పంట తీసేంతవరకు నిరంతరాయంగా వర్షాలు కురవడం దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. పండిన పత్తిని తీసేందుకు కూలీల కొరత అధికంగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుండి రెండింతల చెల్లించి పత్తి తీశారు. చివరకు అమ్ముకునేందుకు మిల్లు వద్దకు వెళ్తే సీసీఐ అధికారులు నాణ్యత లేదంటూ దిగుమతికి నిరాకరిస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు.
తేమ శాతం తక్కువగా ఉన్న పత్తి నాణ్యత లేదంటూ అనేక మంది రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారులు రైతులను కనీసం పట్టించుకోకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. జిల్లాలో కల్వకుర్తి, తాడూరు , తెలకపల్లి మండలాల్లో అధికంగా పత్తి సాగు అధికంగా జరుగుతుండడంతో ఈ ప్రాంతంలో జిన్నింగ్ మిల్లుల సంఖ్య కూడా అధికంగా ఉన్నాయి. కొనుగోలు మాత్రం సిసిఐ చేస్తున్నప్పటికీ అక్కడ యజమానులదే పెత్తనం కావడంతో రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.
రూ.5000 క్వింటాలు.
వ్యాపారులు అధికారులు కుమ్మక్కై రైతులు తీసుకువచ్చిన పత్తిని నాణ్యత పేరుతో కొర్రీలు పెడుతూ దిగుమతి చేసుకోకపోవడంతో తప్పని పరిస్థితిలో తక్కువ ధరకు అనేక మంది విక్రయిస్తూ భారీగా నష్టపోతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఎనిమిది వేల పైన ఉన్నప్పటికీ అధికారులు కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులకు క్వింటాల్ రూ. 5000కు అమ్ముకుం టున్నారు. దీంతో రైతుకు క్వింటాల్ పై మూడు వేల రూపాయల నష్టం వాటిల్లుతుంది. ఎన్నడూ లేని విధంగా కూలీలకు క్వింటాలకు 3000 రూపాయల ఖర్చు కావడం దిగుబడి కూడా గణనీయంగా తగ్గడంతో ప్రతి ఎకరాకు సుమారు 40 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిమితి విధింపుతో ఇబ్బందులు..
కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలుకు నిబంధనలు పెట్టడంతో రైతుల పాలిట శాపంగా మారింది ఒక ఎకరానికి 7 క్వింటా లు మాత్రమే కొనుగోలు చేసేలా ఏర్పాటు చేయడంతో అనేకమంది రైతులకు ఇబ్బందులు పడుతున్నారు . ప్రధానంగా కౌలు రైతులు పత్తిని అమ్ముకోలేకపోతున్నారు. తమ పేరున భూమి లేకపోవడం భూ యజమానులు అందుబాటులో లేకపోవడంతో పండించిన పంటను అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు న్యాయం జరిగేట్టుగా చూడాలని వేడుకుంటున్నారు.




