04-05-2025 12:00:00 AM
దాదాపు అంతా పాలు తాగుతుంటారు కానీ కొందరికివి పడకపోవచ్చు. పాలలో లాక్టోజ్ అనే చక్కెర ఉంటుంది. దీన్ని చిన్న పేగుల నుంచి పుట్టుకొచ్చే లాక్టేజ్ ఎంజైమ్ విచ్చిన్నం చేసి, పాలు జీర్ణమయ్యేలా చేస్తుంది. అయితే దీని ఉత్పత్తి ఐదేళ్ల తర్వాత సహజంగా తగ్గుతూ వస్తుంది. కొందరిలో జన్యుపరంగా లాక్టేజ్ మోతాదు గణనీయంగా పడిపోవచ్చు కూడా.
దీంతో కొద్దిగా పాలు తాగినా జీర్ణం కావు. దీన్నే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు. సాధారణంగా లాక్టేజ్ ఎంజైమ్ పాలను గ్లూకోజు, గ్యాలక్టోజ్ అనే చక్కెరలుగా విడగొడుతుంది. ఇవి పేగుల గోడల ద్వారా రక్తంలో కలుస్తాయి. లాక్టేజ్ ఎంజైమ్ తగినంత ఉత్పత్తి కాకపోతే లాక్టోజ్ నేరుగా పెద్ద పేగులోకి వెళ్తుంది. ఇది అక్కడి బ్యాక్టీరియాతో చర్య జరుపుతుంది.
ఫలితంగా విరేచనాలు, వికారం, కొన్నిసార్లు వాంతులు, కడుపునొప్పి, కడుపుబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పాలు తాగాక అరగంట నుంచి రెండు గంటల్లో ఇవి తలెత్తుతాయి. పాలు, పాలతో చేసే పదార్థాలు తినటం మానేస్తే ఇవీ తగ్గుతాయి. కావాలంటే పెరుగు తీసుకోవచ్చు. ఇది పాక్షికంగా జీర్ణమైన పాలతో తయారవుతుంది. కాబట్టి శరీరం బాగానే గ్రహిస్తుంది.